Updated : 03/01/2021 11:13 IST

జనవరి 26న రాజ్‌పథ్‌లో కవాతు చేస్తాం

4వ తేదీ చర్చలు విఫలమైతే.ఆందోళనే : కిసాన్‌ మోర్చా
కేంద్రంపై ఒత్తిడి పెంచేలా దేశవ్యాప్త కార్యాచరణ

ఈనాడు, దిల్లీ: కొత్త సాగు చట్టాల రద్దు కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఆరు విడతల చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వని నేపథ్యంలో సోమవారం మరో దఫా సంప్రదింపులకు రంగం సిద్ధమైన వేళ...తమ తదుపరి కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 4వ తేదీ చర్చలు సఫలమవుతాయని భావిస్తున్నామని, ఒకవేళ అవి విఫలమైతే.. గణతంత్ర దినోత్సవం (ఈనెల 26) రోజు దిల్లీలోని రాజ్‌పథ్‌లో రైతు కవాతు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారిక పరేడ్‌ పూర్తయిన తర్వాత ట్రాక్టర్లు, ట్రాలీలు, ఇతర వాహనాలతో తమ కవాతు ఉంటుందని సంయుక్త కిసాన్‌ మోర్చా వెల్లడించింది. శనివారం దిల్లీలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన తొలి విలేకర్ల సమావేశంలో సమన్వయ కమిటీలోని ఏడుగురు రైతు నేతలు మాట్లాడారు. ‘‘మేం శాంతియుతంగానే ఉద్యమం కొనసాగించాలనుకుంటున్నాం. మీరు(ప్రభుత్వం) మూడు సాగు చట్టాలు రద్దుచేయండి, లేదంటే మమ్మల్ని ఖాళీచేయించడానికి భద్రతా బలగాలనైనా ఉపయోగించండి అని చర్చలు మొదలైన రోజే ప్రభుత్వానికి చెప్పాం. ఇప్పడు నిర్దిష్టమైన కార్యాచరణ చేపట్టే సమయం ఆసన్నమైంది. తీవ్రమైన చలిని కూడా లెక్కచేయకుండా డిమాండ్ల పరిష్కారం కోసం దిల్లీ సరిహద్దుల్లో శాంతియుత ఉద్యమం చేపట్టి ఈ నెల 26వ తేదీకి రెండు నెలలు పూర్తవుతుంది. అందుకే డిమాండ్ల సాధన దిశగా మా సంకల్పాన్ని చాటడానికి ప్రజాధికార దినోత్సవమైన రిపబ్లిక్‌ డే రోజు రాజ్‌పథ్‌లో కవాతు నిర్వహించాలని నిర్ణయించాం’’ అని రైతు నేతలు బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌, దర్శన్‌పాల్‌, గుర్నాంసింగ్‌ చాదుని, అశోక్‌ ధావలె, జగ్జిత్‌సింగ్‌ దల్లేవాల్‌, అభిమన్యు కొహాడ్‌, యోగేంద్ర యాదవ్‌లు వెల్లడించారు.

రెండు హామీలపై ఉత్తర్వులేవీ?
గత నెల 30న జరిగిన ఆరో విడత చర్చల్లో రెండు చిన్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ వాటిపై ఇప్పటి వరకు లిఖితపూర్వకంగా ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని రైతుల నేతలు తెలిపారు. రైతు ప్రయోజనాలతో ముడిపడిన, కీలకమైన పెద్ద డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు.

ఇదీ ఉద్యమ కార్యాచరణ
కొత్త వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే దిశగా ఈ నెల 26వ తేదీ వరకు కార్యాచరణను సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. రైతుల నిరసనలపై ప్రభుత్వం సాగిస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ఈనెల 6 నుంచి 20 వరకు 15రోజుల పాటు ‘దేశ్‌ జాగృతి అభియాన్‌’ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు చేపడతారు. బోగి, సంక్రాంతిలను రైతు సంకల్ప దినోత్సవాలుగా పాటిస్తారు. మూడు చట్టాల ప్రతులను బోగి మంటల్లో దహనం చేయనున్నట్లు మోర్చా పేర్కొంది. 18న మహిళా రైతు దినోత్సవం, 23న నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి సందర్భంగా ఆజాద్‌ హింద్‌ కిసాన్‌ దివస్‌ను నిర్వహిస్తారు. ఆ రోజు అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్‌ అధికార నివాసాల ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు రైతు నేతలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో 4వ తేదీ చర్చలు విఫలమైతే 6వ తేదీన కుంద్లి-మనేసర్‌-పల్వల్‌ ఎక్స్‌ప్రెస్‌హైవేపై ట్రాక్టర్లతో కవాతు నిర్వహిస్తామన్నారు.

వృద్ధ రైతు ఆత్మహత్య
వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఆందోళనల్లో ఇద్దరు మనుమరాళ్లతో కలిసి పాల్గొంటున్న సర్దార్‌ కశ్మీర్‌ సింగ్‌ (75) అనే రైతు శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌ జిల్లా బిలాస్‌పుర్‌కు చెందిన ఈ రైతు గాజీపుర్‌ సరిహద్దుల్లోని శిబిరం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్డిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. కొత్త చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలని ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. తన ఇద్దరు మనుమరాళ్లకు, కష్టాల్లో ఉన్న వివాహితురాలైన కుమార్తెకు చేయూతనందించాల్సిందిగా రైతు నేతలకు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

మొండి వైఖరి వీడండి : కాంగ్రెస్‌
రైతుల డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలని కాంగ్రెస్‌ హితవు పలికింది. ఉద్యమంలో పాల్గొన్న పలువురు రైతులు మృతిచెందటంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. 57 మంది అన్నదాతలు ప్రాణాలు అర్పించినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల నిర్దయతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సుర్జేవాలా ట్వీట్‌ చేశారు. రైతుల మృతిపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ప్రాణ త్యాగాలు చేస్తుంటే భాజపా తన కర్కశత్వాన్ని చాటుకుంటోందని ధ్వజమెత్తారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని