Farmers Killed: నలుగురు రైతుల బలి

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం రైతులు చేపట్టిన ఆందోళన పెద్ద ఎత్తున హింసకు దారితీసింది. రహదారిపై నిరసన వ్యక్తంచేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోం శాఖ సహాయ

Updated : 04 Oct 2021 12:11 IST

ఉద్యమకారులపైకి దూసుకెళ్లిన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడి కారు

అనంతరం చెలరేగిన హింసలో మరో నలుగురి మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోరం

అక్కడ తన కుమారుడు లేడన్న కేంద్రమంత్రి

ఘటనపై రైతు సంఘాల భగ్గు

నేడు దేశవ్యాప్త నిరసనలు

లఖ్‌నవూ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం రైతులు చేపట్టిన ఆందోళన పెద్ద ఎత్తున హింసకు దారితీసింది. రహదారిపై నిరసన వ్యక్తంచేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన అన్నదాతలు దాడి చేయడంతో ఓ కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. నిరసనకారులు రెండు కార్లను తగలబెట్టారు. ఘటన సమయంలో తమ కుమారుడు వాహనంలో లేడని, అక్కడ ఉన్నవారే భాజపా కార్యకర్తలను, కారు డ్రైవరును కొట్టి చంపారని అజయ్‌ మిశ్ర ఆరోపించారు. ఈ ఘటనపై రైతు సంఘాలు మండిపడ్డాయి. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయాల ఎదుట సోమవారం ఉదయం 10:00 గంటల నుంచి 01:00 గంట మధ్య ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి. మరోవైపు కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఘటన గురించి తెలియగానే కర్షక నేత రాకేశ్‌ టికాయిత్‌తోపాటు హరియాణా, పంజాబ్‌లకు చెందిన రైతులు ఉత్తర్‌ప్రదేశ్‌కు బయల్దేరారు. లఖింపుర్‌ ఖేరి జిల్లాలోని అజయ్‌ మిశ్ర స్వగ్రామమైన బన్బీర్‌పుర్‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయనతో పాటు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య హాజరు కావాల్సి ఉంది. అయితే సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులు కేశవ్‌ ప్రసాద్‌ ఎదుట నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అందుకోసం తికోనియా-బన్బీర్‌పుర్‌ రహదారిపైకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కేశవ్‌ ప్రసాద్‌కు స్వాగతం పలకడానికి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర వాహన శ్రేణితో అటువైపు రాగా రైతులు నల్ల జెండాలు చూపుతూ నినాదాలు చేశారు. అయితే రెండు కార్లు ఉన్నట్టుండి రైతుల మీదకు దూసుకెళ్లాయి. ఈ హఠాత్పరిణామానికి నిరసనకారులు చెల్లాచెదురయ్యారు. గాయపడిన అన్నదాతల హాహాకారాలు, రక్తసిక్తమైన రహదారితో ఆ ప్రదేశంలో భీతావహ పరిస్థితి నెలకొంది. మంత్రి కుమారుడి అమానుష చర్యపై ఆగ్రహించిన రైతులు ఆయన కారుతో పాటు మరో కారును తగలబెట్టారు. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది మరణించారని లఖింపురి ఖేరి జిల్లా మేజిస్ట్రేట్‌ అర్వింద్‌ కుమార్‌ తెలిపారు. కనీసం 8 మంది గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో కర్షక నేత తేజీందర్‌ సింగ్‌ విర్క్‌ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాల మేరకు అసిస్టెంట్‌ డీజీపీ ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేశవ్‌ ప్రసాద్‌ కార్యక్రమాన్ని రద్దుచేశారు.

రైతులే రాళ్లు విసిరారు: అజయ్‌ మిశ్ర

రైతులపైకి దూసుకెళ్లిన కారులో తన కుమారుడు ఉన్నారన్న వార్తలను అజయ్‌ మిశ్ర ఖండించారు. ఘటన సమయంలో తాను కానీ, తన కుమారుడు కానీ అక్కడ లేమని చెప్పారు. తామిద్దరం కార్యక్రమ వేదిక వద్ద ఉన్నామన్నారు. రైతుల్లో ఉన్న కొన్ని అల్లరి మూకలే రాళ్లు విసరడంతో కారు తిరగబడిందని, దాని కింద పడి రైతులు మరణించారని చెప్పారు. నిరసనకారులు దాడి చేయడంతో ముగ్గురు భాజపా కార్యకర్తలు, కారు డ్రైవరు ప్రాణాలు కోల్పోయారన్నారు. వాహనశ్రేణిలోని ఓ కారు తిరగబడడంతో దాని కింద పడి రైతులు చనిపోయారని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. దీంతో వెనుక వాహనం దెబ్బతిందని, రైతులు అందులోని వారిని బయటికి లాగి దాడి చేసి చంపారని పేర్కొన్నారు.

సుప్రీం జడ్జితో దర్యాప్తు జరిపించాలి: రైతు సంఘాలు

అజయ్‌ మిశ్రను వెంటనే పదవి నుంచి తొలగించాలని, ఘటనపై యూపీ అధికారులతో కాకుండా సుప్రీం కోర్టు న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని కర్షక నేత యోగేంద్ర యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఘటన జరిగినప్పుడు కారులో ఆశిష్‌ మిశ్ర ఉన్నారని చెప్పారు. రైతులు ఎలాంటి హింసకు పాల్పడకుండా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. నిరసన ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న రైతులపై దాడి జరిగిందని, వారిపై కాల్పులు కూడా జరిపారని రాకేశ్‌ టికాయిత్‌ పేర్కొన్నారు. ఆశిష్‌తో పాటు ఇతర గూండాలపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్‌ఎల్‌డీ నేత జయంత్‌ చౌధురీ, వామపక్ష నేతలు సోమవారం లఖింపుర్‌ ఖేరికి వెళ్లనున్నారు.


రైతులకు లాఠీ ‘ట్రీట్‌మెంట్‌’ ఇవ్వాలి: ఖట్టర్‌ 

చండీగఢ్‌: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న రైతులకు దెబ్బకు దెబ్బ కొట్టి ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ భాజపా శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం భాజపా కిసాన్‌ మోర్చా సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ‘‘500-1000 మంది కలిసి స్వచ్ఛంద సేవకుల బృందంగా ఏర్పడి రైతులను లాఠీలతో కొట్టండి. ఇలా చేసి జైలుకు వెళ్తే బెయిల్‌ కోసం ఆలోచించకండి. అన్నీ మేం చూసుకుంటాం. జైలుకు వెళ్లాల్సి వస్తే కంగారు పడకండి. జైలులో నెల రోజులో, రెండు నెలలో, ఆరు నెలలో ఉంటే మీరు పెద్ద నాయకులయిపోతారు. చరిత్రలో మీ పేరు రాస్తారు’’ అన్నారు. దీనిపై రైతు సంఘాలు, విపక్షాలు విరుచుకుపడ్డాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని