ఉన్నత విద్యలో వెనుకబాటు!

ఉన్నత విద్యలో అసమానతలతో పాటు తరగతి గదిలో చెప్పే పాఠాలను అర్థం చేసుకోవడంలో విద్యార్థులు వెనకబడుతున్నారు.తెలంగాణలోని 31 శాతం కాలేజీలకు యూజీసీˆ లేదా ఇతర

Published : 27 Jan 2022 03:55 IST

అర్థం చేసుకోవడంలో 9 శాతం కాలేజీల్లోని విద్యార్థులే మెరుగు

సెస్‌, రాష్ట్ర ఉన్నతవిద్యామండలి సర్వేలో వెల్లడి

ఈనాడు,హైదరాబాద్‌; ఉన్నత విద్యలో అసమానతలతో పాటు తరగతి గదిలో చెప్పే పాఠాలను అర్థం చేసుకోవడంలో విద్యార్థులు వెనకబడుతున్నారు.తెలంగాణలోని 31 శాతం కాలేజీలకు యూజీసీˆ లేదా ఇతర కౌన్సిళ్ల గుర్తింపు లేదు. అసలు వీటి నిధులు తీసుకోవడానికి 88 శాతం సంస్థలకు అర్హత లేదని హైదరాబాద్‌లోని ఆర్థిక, సామాజిక అధ్యయన సంస్థ(సెస్‌) నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. క్లాసురూముల్లో చెప్పే పాఠాలను అర్థం చేసుకోవడంలో కొందరు విద్యార్థులు బాగా వెనకబడి ఉన్నారని 95 శాతం విద్యాసంస్థలు నివేదించాయి. ఇలాంటి పరిస్థితి 98.5 శాతం మెడికల్‌ కాలేజీల్లో ఉంటే, 96 శాతం ఇంజినీరింగ్‌, 95 శాతం డిగ్రీ , 94 శాతం మేనేజ్‌మెంట్‌, కామర్స్‌, 92.3 శాతం ఫార్మసీˆ-నర్సింగ్‌ కాలేజీల్లో ఉంది. సెస్‌, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తంగా విద్యారంగంపై అధ్యయనం చేసేందుకు 2020 జులైలో ప్రత్యేకంగా ఓ సెల్‌ను ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలపై సెస్‌కు చెందిన చంద్రశేఖర్‌, వెంకటనారాయణలు అధ్యయనం చేసి రూపొందించిన ప్రాథమిక నివేదికలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

* రాష్ట్రంలో మొత్తం 2,084 ఉన్నత విద్యాసంస్థలుండగా, 1,575 కాలేజీల్లో అధ్యయనం చేశారు.  ఇంజినీరింగ్‌-టెక్నాలజీ, డిగ్రీ, ఫార్మసీ-నర్సింగ్‌, వైద్య, టీచర్‌ ఎడ్యుకేషన్‌, మేనేజ్‌మెంట్‌ కామర్స్‌, హోటల్‌-టూరిజం, న్యాయ ఇలా మొత్తం తొమ్మిది రకాల కళాశాలలను అధ్యయనం కోసం ఎంపిక చేసుకొన్నారు.వీటిలో 50.4 శాతం గ్రామీణ,  49.6 శాతం నగర,పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. 

* సర్వే చేసిన 1,575 విద్యాసంస్థల్లో ములుగు జిల్లాలో ఒకే ఒక ఉన్నత విద్యాసంస్థ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గద్వాల, భూపాలపల్లి, వనపర్తి జిల్లాల్లో మూడేసి కళాశాలలున్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 320 ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 230, నల్గొండలో 135, కరీంనగర్‌లో 122 ఉన్నాయి. సర్వే చేసిన ఉన్నత విద్యాసంస్థల్లో 1,379 (87.6శాతం) ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ కాలేజీలు కాగా, ప్రభుత్వ యాజమాన్యంలోనివి 140(9 శాతం). 56(3.6) ప్రైవేటు ఎయిడెడ్‌ కళాశాలలున్నాయి. అన్నింటిలోనూ ప్రైవేటు విద్యాసంస్థలదే ఆధిపత్యం ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది, డిగ్రీ కాలేజీల్లో కూడా 84 శాతం ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి.

* పాఠాలను విద్యార్థులందరూ ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారన్నదానిపై 9 శాతం విద్యా సంస్థల్లో మాత్రమే సమాన స్థాయిలో అర్థం చేసుకొనే పరిస్థితి ఉందని ఆయా సంస్థలు చెప్పాయని నివేదిక వెల్లడించింది. మిగిలిన 91 శాతం  సంస్థల్లోని విద్యార్థులు బాగా వెనకబడి ఉన్నట్లు సర్వే తెలిపింది. ఎసీˆ్స,ఎసీˆ్ట,ఓబీసీˆ, మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించేందుకు యూజీసీˆ ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టినా, ఇది ఉందని కూడా చాలా సంస్థలకు తెలియదు. 2012-17 మధ్య రాష్ట్రంలో 2.7 శాతం విద్యా సంస్థలు మాత్రమే యూజీసీˆ నుంచి పునశ్చరణ తరగతులకిచ్చే సదుపాయాన్ని ఉపయోగించుకొన్నాయి. ఒక్కో విద్యాసంస్థకు సంవత్సరానికి రూ.ఏడు లక్షలు ఆర్థికసాయం అందుతుంది. ఉన్నత విద్యలో ఉన్న లోపాలను ఈ నివేదిక విశ్లేషించింది.
సర్వే చేసిన కాలేజీల్లో 9.3 లక్షల మంది విద్యార్థులు ఉండగా, సరాసరిన ఒక్కో ఇంజినీరింగ్‌ కాలేజీలో 1,500 మంది ఉన్నట్లు నివేదిక పేర్కొంది. డిగ్రీ కళాశాలల్లో 561 మంది, మెడికల్‌ 329, మేనేజ్‌మెంట్‌-కామర్స్‌లో 322, ఫార్మసీˆ-నర్సింగ్‌లో 311 మంది ఉన్నారు. అధ్యాపకుల సంఖ్యలో కూడా సరాసరిన ఒక్కో ఇంజినీరింగ్‌ కాలేజీలో 111 మంది ఉండగా,  వైద్యకళాశాలలో 58, ఫార్మసీ-నర్సింగ్‌లో 30, డిగ్రీలో 21 మంది మాత్రమే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని