పసుపు పండగకు పోటెత్తిన జనం

మహానాడు ప్రాంగణం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: ‘క్విట్‌ జగన్‌- సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినాదం ఏపీలోని ప్రతి ఇంట్లో మార్మోగాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్‌ అధికారంలో ఉంటే రాష్ట్రం బాగుపడదని,....

Published : 28 May 2022 03:53 IST

అట్టహాసంగా మహానాడు ప్రారంభం
క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌
ఈ నినాదం ఇంటింటా మార్మోగాలి
ప్రారంభోపన్యాసంలో చంద్రబాబు

మహానాడు ప్రాంగణం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: ‘క్విట్‌ జగన్‌- సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినాదం ఏపీలోని ప్రతి ఇంట్లో మార్మోగాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్‌ అధికారంలో ఉంటే రాష్ట్రం బాగుపడదని, ఆయన దిగిపోతే తప్ప మంచి రోజులు రావని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో శుక్రవారం ప్రారంభమైన తెదేపా మహానాడు వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు. మూడేళ్ల విరామం తర్వాత భారీ ఎత్తున మహానాడు జరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి జనం పోటెత్తారు. మండే ఎండలనూ లెక్కచేయకుండా, సుదూర ప్రాంతాల నుంచి ఉత్సాహంగా కదలివచ్చారు. చిన్న, పెద్ద, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యువజనం సందడికి కొదవేలేదు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారుల ఆనందానికి అంతే లేదు. ఎక్కడెక్కడి నుంచో రైళ్లు, బస్సుల్లోను, ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటుచేసుకుని మరీ వచ్చారు. నాయకుల ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా వారంతట వారే తరలివచ్చారు. భారీ జనసందోహాన్ని ఉద్దేశించి అధినేత చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మూడేళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. అందుకు దిశానిర్దేశం చేసుకోవాల్సి ఉందన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి... మోసపూరిత సంక్షేమం, అవినీతితో జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారని.. అలాంటి వైకాపా ప్రభుత్వాన్ని, పాలకుల్ని నడిరోడ్డుపై నిలదీయాల్సిన బాధ్యత ప్రజలదేనని పిలుపునిచ్చారు. ఈ మూడేళ్లలో జగన్‌, ఆయన అనుచరుల ఆదాయాలు పెరగ్గా, ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయని, వారి ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఆస్తుల విలువలు పడిపోయాయని పేర్కొన్నారు. అధిక ధరలు, పన్నులతో ప్రజల్ని బాదేసి... రాష్ట్రాన్ని జగన్‌ దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఈ ‘బాదుడే.. బాదుడు’ను ప్రతి చెవిలో వేయాల్సిన బాధ్యత తెదేపా కార్యకర్తలదేనని సూచించారు. ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో శుక్రవారం ఉదయం తెదేపా మహానాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. 25 మంది ఎంపీల్ని, అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తానంటూ ఎన్నికలకు ముందు చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు కేంద్రం ముందు మెడలు దించారని విమర్శించారు. విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు నిధులు సహా ఏమీ సాధించలేకపోయారని ధ్వజమెత్తారు.

డయాఫ్రమ్‌ వాల్‌ అంటే జగన్‌కు తెలుసా?

‘రివర్స్‌ టెండర్ల పేరిట పోలవరం ప్రాజెక్టును జగన్‌ నాశనం చేశారు. దానివల్లే డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయింది. ప్రాజెక్టులో అదే అత్యంత కీలకం. అదే లేకపోతే నీళ్లే నిల్వ ఉంచలేని పరిస్థితి. అసలు జగన్‌కు డయాఫ్రమ్‌ వాల్‌ అంటే ఏంటో, కాఫర్‌ డ్యామ్‌ అంటే ఏంటో తెలుసా? ఆయన అనాలోచిత, కక్షపూరిత చర్యలవల్ల ఇప్పుడు రైతులు, రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. ఏం పాపం చేసిందని రూ.2లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్ల సంపద సృష్టించే అమరావతిని నాశనం చేశారో జగన్‌ సమాధానం చెప్పాలి. మా హయాంలో మేము 25వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశాం. మూడేళ్లలో వైకాపా ప్రభుత్వం కొత్తగా ఒక్క కిలోమీటరు రోడ్డైనా నిర్మించిందా?  30లక్షల ఇళ్లు కడతామని చెప్పిన జగన్‌ .. మూడేళ్లలో మూడిళ్లు అయినా నిర్మించలేకపోయారు.

కోనసీమలో చిచ్చుకు వైకాపాయే కారణం. ఆ పార్టీకి నిజంగానే అంబేడ్కర్‌పై అభిమానముంటే తెదేపా హయాంలో తలపెట్టిన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు ప్రాజెక్టును ఎందుకు నిలిపేశారు? ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌గా ఉన్నప్పుడే అంబేడ్కర్‌కు భారతరత్న లభించింది.

వ్యవసాయ మోటార్లకు మీటర్లపై పోరాడాలి

వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటానికి రైతులంతా సిద్ధం కావాలి. వారికి తెదేపా మద్దతుగా ఉంటుంది. వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్తు మీటర్లు తీసేసింది ఎన్టీఆరే. అవి ఏర్పాటు చేస్తే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి. రైతన్నలను కోరుతున్నా. ప్రభుత్వంపై పోరాడండి. రాష్ట్రంలో రైతుల నుంచి కొన్న ధాన్యానికి డబ్బులిచ్చే పరిస్థితే లేదు. వ్యవసాయానికి ఈ ప్రభుత్వం నుంచి సహకారమే లేదు.

బీసీ ఛాంపియన్‌ ఎలా అవుతారు?

తూర్పు కాపులు, కొప్పుల వెలమల సహా మరికొన్ని బీసీ కులాల్ని తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగిస్తే  వారి తరఫున మాటైనా మాట్లాడని, తెదేపా మాజీ నాయకుడైన వ్యక్తికి వైకాపా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. మైనారిటీలకు 4% రిజర్వేషన్ల కల్పనను వ్యతిరేకించిన ఆ వ్యక్తికి రాజ్యసభ స్థానం ఎలా ఇస్తారు? మీ పార్టీ సీట్లు అమ్ముకుంటే అమ్ముకోండి. మీకు నచ్చినవారికి ఇచ్చుకోండి. అంతే తప్ప అవాస్తవాలు చెప్పొద్దు.

పోలీసులూ... ఉన్మాది చేతిలో బలైపోవొద్దు

అసాంఘిక శక్తులు, రౌడీలు, తీవ్రవాదుల్ని అణిచివేయటానికి తెదేపా హయాంలో పోలీసుల్ని వినియోగించాం. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలపై ప్రతాపం చూపటానికి వినియోగిస్తున్నారు. తెదేపా కార్యకర్తలు ఎవరూ పోలీసు కేసులు, లాఠీలకు భయపడాల్సిన అవసరం లేదు. డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకూ ప్రతి ఒక్క పోలీసుకూ చెబుతున్నా. మీరెవరూ అనవసరంగా ఉన్మాది చేతిలో బలైపోవొద్దు. మీరు తప్పుడు పనులు చేస్తే విడిచిపెట్టం.

నిద్రలేని రాత్రులు గడిపా

తెదేపాను స్థాపించి 40 ఏళ్లు అయింది. గతంలో ఎన్నడూ లేనన్ని ఇబ్బందులు ఈ మూడేళ్లలో ఎదుర్కొన్నాం. అచ్చెన్నాయుడు సహా పార్టీ నాయకులు అనేక మందిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తుంటే నిద్రలేని రాత్రులు గడిపా.ఉన్మాద పాలన రాష్ట్రానికి శాపమైంది. దద్దమ్మ పాలన వల్ల రాష్ట్రం పరువుపోయింది. ఏపీ చరిత్రను తెదేపా కంటే ముందు, తెదేపా తర్వాత అని చదువుకోవాలి.
* పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం పన్నులు తగ్గించినా వైకాపా ప్రభుత్వం తగ్గించలేదు. గ్యాస్‌ ధరలు, విద్యుత్తు ఛార్జీలు భారీగా పెరిగాయి. విద్యుత్తు సరఫరా ఉండదుగానీ.. ఛార్జీలను బాదుతున్నారు. అమ్మఒడి అన్నారు.. నాన్న బుడ్డి తెచ్చి అంతకు మించి దోచేస్తున్నారు. తెదేపా హయాంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు. ఇంట్లో ఉన్న మహిళలకూ రక్షణ లేదు. మద్యం, గంజాయి, డ్రగ్స్‌ పుణ్యమా అని ఏపీ నేరాంధ్రప్రదేశ్‌గా మారిపోయింది’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.


40% సీట్లు యువతకే..

మరో 40ఏళ్ల పాటు తెదేపా ఇదే ఉత్సాహంతో ఉండాలంటే పార్టీలోకి కొత్త రక్తం ఎక్కించాలి. అందుకే రాబోయే ఎన్నికల్లో 40% సీట్లు యువతకే ఇస్తాం. ఎన్టీఆర్‌ ఆత్మగౌరవం తెస్తే... నేను ఆత్మవిశ్వాసం కల్పించాను. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం మరిన్ని ఆలోచనలు చేస్తున్నా. 5వేల మంది కార్యకర్తలకు రూ.100కోట్ల బీమా పరిహారం ఇప్పించాం. నీరు-చెట్టు బిల్లులు న్యాయస్థానంలో పోరాడి సాధించాం. కార్యకర్తల ఆరోగ్యం, ఆదాయం పెంచేందుకు కొత్త కార్యక్రమాన్ని తలపెడతాం. అవసరమైతే కొన్ని ఆసుపత్రుల్ని ఎంప్యానల్‌ చేయించి.. తెదేపా కార్యకర్తలకు రాయితీపై, ఉచితంగా చికిత్స చేయిస్తాం. తెదేపాకు కార్యకర్తలే ఆస్తి. వారిని సమర్థంగా ఉపయోగించుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని