PM CARES: కరోనా బాధితులకు భరోసా

కరోనా మహమ్మారి సృష్టించిన పెను విపత్తులో ఆప్తుల్ని కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు, తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని అనాథలుగా మారిన చిన్నారులకు సాంత్వన చేకూర్చే వివిధ చర్యల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. కన్నవారి మృతితో అనాథలైన చిన్నారుల జీవితానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు విద్యనందించే ఏర్పాటు చేయనున్నారు. బాధిత పిల్లలు 18 ఏళ్ల వయసుకు వచ్చే నాటికి వారి పేరున రూ.10 లక్షల మూల నిధిని పీఎంకేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ద్వారా ప్రభుత్వం సమకూర్చుతుంది. కార్మిక రాజ్య బీమా సంస్థ, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థల సభ్యుల కుటుంబాలకు చేయూతనిచ్చే చర్యల్ని ప్రకటించింది.

Updated : 30 May 2021 10:46 IST

తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక భద్రత  
18 ఏళ్లకు చేరుకునే నాటికి రూ.10 లక్షల మూలనిధి
అప్పటి నుంచి అయిదేళ్ల పాటు నెలవారీ భృతి
ఆర్జించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబానికి పింఛను
ఉద్యోగి చనిపోతే చెల్లించే బీమా ప్రయోజనాల పెంపు
కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయాలు
ఈనాడు - దిల్లీ

ప్రస్తుత సంక్లిష్ట సమయంలో ఒక సమాజంగా పిల్లల బాగోగులను చూసుకోవడంతో పాటు ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత మనదే. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయినవారు, ఉన్న ఒక తల్లినో తండ్రినో పోగొట్టుకున్న వారు, చట్టపరమైన సంరక్షకులు, దత్తత తల్లిండ్రులను కోల్పోయిన వారందరికీ పీఎంకేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పథకం ద్వారా చేయూతనందిస్తాం. దాతలు పీఎంకేర్స్‌ ఫండ్‌కు మరింత ఉదారంగా విరాళాలు అందించడం వల్లనే ఇది సాధ్యమవుతోంది.

- ప్రధాని మోదీ

కరోనా మహమ్మారి సృష్టించిన పెను విపత్తులో ఆప్తుల్ని కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు, తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని అనాథలుగా మారిన చిన్నారులకు సాంత్వన చేకూర్చే వివిధ చర్యల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. కన్నవారి మృతితో అనాథలైన చిన్నారుల జీవితానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు విద్యనందించే ఏర్పాటు చేయనున్నారు. బాధిత పిల్లలు 18 ఏళ్ల వయసుకు వచ్చే నాటికి వారి పేరున రూ.10 లక్షల మూల నిధిని పీఎంకేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ద్వారా ప్రభుత్వం సమకూర్చుతుంది. కార్మిక రాజ్య బీమా సంస్థ, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థల సభ్యుల కుటుంబాలకు చేయూతనిచ్చే చర్యల్ని ప్రకటించింది. మోదీ నేతృత్వంలో శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పిల్లలే ఈ దేశ భవిష్యత్తు, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్ది బలమైన భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.  
* ప్రత్యేక పథకం కింద పీఎంకేర్స్‌ నిధితో ప్రతి చిన్నారి 18 ఏళ్లకు చేరుకునే సమయానికి వారి పేరున రూ.10లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి మూల నిధిగా ఉపయోగిస్తారు.
* ఆ నిధి నుంచి 18వ సంవత్సరం నుంచి అయిదేళ్లపాటు నెలవారీ భృతి మంజూరు చేస్తారు. ఉన్నత విద్యకు వచ్చిన సమయంలో పిల్లల వ్యక్తిగత అవసరాలకు ఈ భృతి ఉపయోగపడుతుంది.
* 23 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత రూ.10 లక్షల నిధిని వ్యక్తిగత, వృత్తిగత అవసరాల కోసం ఒకేసారి తీసుకోవడానికి వీలు కల్పిస్తారు.

పదేళ్లలోపు వారికి పాఠశాల విద్య
* తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు సమీప కేంద్రీయ విద్యాలయంలో, లేదా ప్రైవేటు పాఠశాలలో డే స్కాలర్‌గా ప్రవేశం కల్పిస్తారు.
* ఒకవేళ చిన్నారి ప్రైవేటు పాఠశాలలో చేరితే విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం వారి బోధనా రుసుములను పీఎంకేర్స్‌ నిధుల ద్వారా చెల్లిస్తారు.
* యూనిఫామ్‌, పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాల కోసమూ పీఎం కేర్స్‌ నుంచి చెల్లింపులు జరుగుతాయి.

11-18 ఏళ్లలో రెసిడెన్షియల్‌ చదువులు
* 11-18 వయసు వారికి సైనిక్‌ స్కూల్‌, నవోదయ విద్యాలయలాంటి కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తారు.
* ఒకవేళ చిన్నారి... సంరక్షకులు/అవ్వాతాతలు/సమీప బంధువుల సంరక్షణలో ఉన్నట్లయితే వారికి సమీపంలోని కేంద్రీయ విద్యాలయం, ప్రైవేటు విద్యా సంస్థల్లో డే స్కాలర్‌ కింద ప్రవేశం కల్పిస్తారు.
* ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరితే విద్యా హక్కు చట్ట నిబంధనల ప్రకారం బోధనా రుసుములను పీఎంకేర్స్‌ ద్వారా చెల్లిస్తారు.
* యూనిఫామ్‌, పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాల కోసమూ పీఎంకేర్స్‌ నిధుల నుంచి డబ్బు ఇస్తారు.

ఉన్నత విద్యకు సాయం
* మన దేశంలో వృత్తి విద్యా కోర్సులు చేయడానికి, ఉన్నత విద్య అభ్యసించడానికి అవసరమయ్యే ఖర్చుల కోసం విద్యారుణ నిబంధనల కింద రుణాలు ఇప్పించడానికి ప్రభుత్వం సాయం చేస్తుంది. ఆ రుణాలపై వడ్డీని పీఎంకేర్స్‌ నిధుల నుంచి చెల్లిస్తారు.
* అర్హులైన పిల్లలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద అండర్‌ గ్రాడ్యుయేట్‌/వొకేషనల్‌ కోర్సులు చేసే పిల్లలకు బోధనా రుసుములు/కోర్సు రుసుముకు సమానమైన ఉపకార వేతనాలను చెల్లిస్తారు. ప్రస్తుతం ఉన్న స్కాలర్‌షిప్‌ పథకాల కిందికి రాని వారికి పీఎంకేర్స్‌ నుంచి ఉపకార వేతనాలకు సమానమైన మొత్తాన్ని చెల్లిస్తారు.

ఆరోగ్య బీమా
* కన్నవారిని కోల్పోయిన చిన్నారులందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తారు. వీరికి 18 ఏళ్లు వచ్చేంత వరకూ ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని పీఎంకేర్స్‌ నిధుల నుంచే సమకూర్చుతారు.

పింఛను, బీమాతో కుటుంబాలకు ధీమా

కొవిడ్‌ కారణంగా సంపాదించే వ్యక్తిని కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. 

ఈఎస్‌ఐసీ కింద కుటుంబ పింఛను
ఉద్యోగి మృతి చెందితే వర్తింపజేసే కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) పింఛను పథకం ప్రయోజనాన్ని కొవిడ్‌తో మృతి చెందినా బాధిత కుటుంబాలకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. మరణించిన వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు దివంగత ఉద్యోగి రోజువారీ వేతనంలో సగటున 90శాతానికి సమానమైన మొత్తాన్ని పింఛను కింద అందించనున్నారు.
* బాధిత కుటుంబం పింఛను పొందాలంటే...బీమా కలిగిన వ్యక్తి మరణానికి కనీసం మూడు నెలల ముందు ఈఎస్‌ఐసీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదై ఉండాలి.
* బీమా కలిగిన వ్యక్తి ఏడాదిలో కనీసం 78 రోజుల పాటు పనిచేసి వేతనం పొందినట్లుగా నమోదై ఉండాలి. 2020 మార్చి 24 నుంచి ఈ ప్రయోజనాన్ని వర్తింపజేస్తారు. 2022 మార్చి 24 వరకు దీన్ని కొనసాగిస్తారు.

ఈడీఎల్‌ఐ గరిష్ఠ ప్రయోజనం పెంపు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు చెందిన...ఎంప్లాయిస్‌ డిపాజిట్‌ అనుసంధానిత బీమా పథకం(ఈడీఎల్‌ఐ) కింద బీమా ప్రయోజనాలను పెంచడంతో పాటు సరళీకృతం చేశారు. కొవిడ్‌ వల్ల మరణించే ఉద్యోగి కుటుంబీకులకు దీని కింద ఇచ్చే గరిష్ఠ బీమా ప్రయోజనాన్ని రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు.
* రూ.2.5 లక్షల కనిష్ఠ బీమా ప్రయోజనాన్ని పునరుద్ధరించారు. ఈ ప్రయోజనాన్ని 2020 ఫిబ్రవరి 15 నుంచి వచ్చే మూడేళ్లు వర్తింపజేస్తారు.
* ఒప్పంద/క్యాజువల్‌ కార్మికులు చనిపోవడానికి ముందు ఒకే సంస్థలో 12 నెలల పాటు విధులు నిర్వహించి ఉండాలన్న నిబంధనను సరళీకరించారు. పూర్తి మార్గదర్శకాలను త్వరలో కేంద్ర కార్మికశాఖ విడుదల చేయనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని