మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌ అడ్డగింత

ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంపై ఆగ్రహించిన రైతులు మెదక్‌ జిల్లాలో జాతీయ రహదారిపై అల్లాదుర్గం వద్ద మంగళవారం మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నారాయణఖేడ్‌ వెళ్లిన మంత్రి తిరిగొచ్చే సమయంలో

Published : 01 Dec 2021 04:10 IST

ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంపై ఆగ్రహం
గంటలో జిల్లా అధికారులు వస్తారన్న హామీతో ఆందోళన విరమణ

- రైతులతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు. వెనుక నిలిచిన వాహనాలు

అల్లాదుర్గం, నారాయణఖేడ్‌ రూరల్‌, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంపై ఆగ్రహించిన రైతులు మెదక్‌ జిల్లాలో జాతీయ రహదారిపై అల్లాదుర్గం వద్ద మంగళవారం మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నారాయణఖేడ్‌ వెళ్లిన మంత్రి తిరిగొచ్చే సమయంలో అల్లాదుర్గం మండల కేంద్రానికి చెందిన రైతులు ధాన్యానికి నిప్పుపెట్టి జాతీయ రహదారిపై బైఠాయించారు. ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ నినాదాలు చేయడంతో హరీశ్‌రావు వారి వద్దకు వచ్చి మాట్లాడారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నామని.. తేమ శాతం సరిగా రావడం లేదంటూ పీఏసీఎస్‌, ఐకేపీ అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు తెలిపారు. తేమ శాతం పరీక్షించే యంత్రాలు తేడా చూపుతున్నాయని వాపోయారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం లేదన్నారు. దీంతో మెదక్‌ జిల్లా కలెక్టర్‌తో హరీశ్‌ ఫోన్లో మాట్లాడారు. గంటలోపు జిల్లా అధికారులు వచ్చి సమస్యను పరిష్కరిస్తారని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అంతకుముందు నారాయణఖేడ్‌లో విలేకరులతో మాట్లాడిన హరీశ్‌రావు.. కేంద్ర ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాయిల్డ్‌ రైస్‌, తడిసిన వడ్లను తీసుకోబోమని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అంటుంటే.. రెండూ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కిషన్‌రెడ్డి చెబుతున్నారన్నారు. ధాన్యంపై కాంగ్రెస్‌, భాజపాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

అల్లాదుర్గం వద్ద రోడ్డుపై బైఠాయించిన రైతులు


వేగవంతంగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణం: హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు ఎనిమిది వైద్య కళాశాలల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మంగళవారం ఆయన ఆర్‌ అండ్‌ బీ అధికారులతో వైద్య కళాశాలల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. జాతీయ వైద్యమండలి నిబంధనలను పాటిస్తూ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునేలా నిర్మాణాలు ఉండాలని సూచించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని