Bandi Sanjay: అన్నీ అబద్ధాలే

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని, వీటిని ప్రచారం చేసేందుకే సభలు, సమావేశాలు పెడుతున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. హుజూరాబాద్‌లో...

Updated : 24 Sep 2022 15:36 IST

62 లక్షల ఎకరాల్లో వరి సాగు అతిపెద్ద అసత్యం
డీజిల్‌, పెట్రోలుపై వ్యాట్‌ 2015లోనే పెంచారు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లే రైతులు ఆగమయ్యారు
త్రివిధ దళాలకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలను వెల్లడిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. చిత్రంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఎంపీ అర్వింద్‌

దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి మీకు నోరెలా వచ్చింది? సోయిలేకుండా ఆ వ్యాఖ్యలు చేసినందుకు త్రివిధ దళాలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలి. చైనాతో మీ రహస్య ఎజెండా ఏమిటి? అక్రమ సంపాదనను అక్కడ పెట్టుబడులుగా పెట్టి ఒప్పందాలు చేసుకుంటున్నారు

- బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని, వీటిని ప్రచారం చేసేందుకే సభలు, సమావేశాలు పెడుతున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. హుజూరాబాద్‌లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా ఆయనలో మార్పురాలేదని ఎద్దేవా చేశారు. ఇన్నేళ్లుగా కేంద్రం ధాన్యం కొంటున్నా, రాష్ట్రమే కొంటున్నట్లు అబద్ధాలు చెప్పిన సీఎం తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ను 5 శాతం తగ్గించాలన్నారు. సోమవారమిక్కడ ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ తెలంగాణ ద్రోహి. రైతులెవరూ కార్లలో తిరగడం లేదు. వడ్లు కొనకపోవడంతో ఆ కుప్పలపై ప్రాణాలు విడుస్తున్నారు. రోహింగ్యాలను ఏమీచేయలేక, దేశప్రతిష్ఠ దిగజార్చేలా..సైనికుల్ని కించపరిచేలా మాట్లాడారు. హిందూ దేవతల్ని, పండుగల్ని అవమానించిన మతతత్వ పార్టీ ఎంఐఎంతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు?’’ అని ప్రశ్నించారు.

మీవల్లే రైతులు ఆగమయ్యారు..
మీ నిర్ణయాలతో రైతులు ఆగమయ్యారు. ఒకసారి వడ్లు వేయాలంటారు.. మరోసారి వద్దంటారు.. పత్తి అంటారు.. కొనరు. ‘ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది.. ఇందులో కేంద్రం పెత్తనం ఏంటి?’ అన్నారు. ఇన్నేళ్లుగా కేంద్రం కొంటోందా? రాష్ట్రం కొంటోందా? స్పష్టం చేయాలి. 62 లక్షల ఎకరాల్లో వరి పంట అనేది అతిపెద్ద అబద్ధం. కొందరు రైస్‌మిల్లర్లతో కుమ్మక్కై రీసైకిల్‌ చేసిన రేషన్‌ బియ్యాన్ని కేంద్రానికి ఇస్తోంది. వానాకాలం పంటకు సంబంధించిన 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని 2021 అక్టోబరు నుంచి 2022 జనవరి వరకు కొనుగోలు చేస్తామని ఆగస్టు 31న కేంద్రం లేఖ రాసింది. దానిని దాచిపెట్టి మోసపు మాటలు మాట్లాడుతున్నారు. రైతు చట్టాలపై దిల్లీ వెళ్తే గతంలో ఎవరూ సహకరించలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు రద్దుచేయాలని ఆ చట్టాల్లో ఉందా? ఉన్నట్లు మీరు చూపిస్తే ముక్కు నేలకు రాస్తా.

వ్యాట్‌ ఎందుకు తగ్గించరు?
పెట్రోలు, డీజిల్‌పై తెరాస ఏకాణా పెంచలేదన్నారు. 2015లో పెట్రోల్‌పై 4శాతం, డీజిల్‌పై 5 శాతం పెంచారు. లీటరు పెట్రోలుపై కేంద్రానికి రూ.27, రాష్ట్రానికి రూ.28 చొప్పున వ్యాట్‌ వస్తోంది. కేంద్రానికి వచ్చేదానిలో రూ.12 తిరిగి రాష్ట్రానికే వెళ్తోంది. లీటరు పెట్రోలుపై రూ.40 తీసుకుంటూ ధరలు పెంచలేదంటున్నారు.24 రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించగా ఇక్కడ ఎందుకు చేయరు? పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ఎందుకు లేఖ ఇవ్వరు? కేంద్రం ఏడేళ్లలో రూ.40 వేల కోట్లు ఇచ్చిందని అబద్ధం చెప్పారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు వెళ్లాయి. ఇందులో రైల్వే, రోడ్లు, పథకాలు తదితరాల కింద రూ.2.52 లక్షల కోట్లు తిరిగి వచ్చాయి. పన్ను తిరిగి చెల్లింపుల కింద రూ.1.04 లక్షల కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.1.22 లక్షల కోట్లు ఇచ్చింది. జాతీయ రహదారులకు రూ.40 వేల కోట్లు ఇవ్వగా.. ఏడేళ్లలో 91 వేల కి.మీ.గా ఉన్న జాతీయ రహదారుల పొడవు 1.49 లక్షల కి.మీ.కు చేరింది. కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చిందని అడుగుతున్నారు. ప్రాంతీయ రింగు రోడ్డు ఇచ్చిందా? ఇవ్వలేదా? చెప్పాలి.  

చేపల పులుసు రహస్యం ప్రజలకు తెలుసు..
కృష్ణాజలాల్లో రాష్ట్రాన్ని మోసం చేశారు. తెలంగాణకు 575 టీఎంసీలు రావలసి ఉండగా 299 టీఎంసీలకు ఒప్పుకొని ఒక్కసారి కాదు.. నాలుగుసార్లు సంతకం పెట్టారు. ఏడేళ్ల క్రితమే సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరిస్తే న్యాయమైన వాటా దక్కేది. కేంద్రానికి లేఖలు రాస్తూ కాలయాపన చేశారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారు. అక్కడ జరిగిన చేపల పులుసు రహస్యం ప్రజలందరికీ తెలుసు. ఏపీ  జీవో-203 జారీ చేసి, ప్రాజెక్టులు కడుతున్నా స్పందించలేదు. అఖిలపక్ష సమావేశానికి వెళ్లలేదు. పక్కరాష్ట్రంలో కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోలేనిది... దేశంలో ఇప్పుడు అగ్గిరాజేస్తమంటున్నారు. ప్రధాని కావాలనుకుంటున్నా ఆయన్ని దేశంలో ఎవరూ పట్టించుకోరు, నమ్మరు.


నక్సలైట్లు పోస్టర్లు వేసినా భయపడలేదు

న్ను చంపేస్తామని నక్సలైట్లు పోస్టర్లు వేసినా భయపడలేదు. ఇప్పుడు భయపడతానా? నమ్మిన సిద్ధాంతం, కాషాయజెండా కోసం నాతో పాటు భాజపా కార్యకర్తలందరూ ప్రాణాలిచ్చేందుకు సిద్ధం. ప్రజల కోసం అనేకసార్లు జైలుకు వెళ్లాం. రాష్ట్రం కోసం సీఎం ఏం త్యాగం చేశారు? అమరుల ఆకాంక్షల సాధనకు భాజపా పోరాడుతుంటే.. 1400 మంది ప్రాణాల మీద మీ కుటుంబం రాజ్యం చేస్తోంది. దళితుణ్ని సీఎం చేయకుంటే మెడలు నరుక్కుంటానన్నారు.. ఏమైంది? బహిరంగసభల పేరిట జాగాలు కబ్జాచేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎవరూ స్థలం ఇవ్వడం లేదు. ఎన్ని కేసులు పెట్టినా, కుట్రలు చేసినా నమ్మిన సిద్ధాంతం కోసం మా ఎమ్మెల్యే రాజాసింగ్‌ పోరాడుతున్నారు. మీ దగ్గర అలాంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా? హైదరాబాద్‌లో నిన్ను ఉరికించి కొడతా అన్న వ్యక్తిని మంత్రిగా చేసుకున్నారు’’ అని తెలిపారు.


తొలిదశ రైతు రుణమాఫీ అమలు చేసేందుకు నాలుగేళ్లు పట్టింది. రెండోదఫా హామీ ఇచ్చి మూడేళ్లయినా అమలు కాలేదు. మీ సొంత నియోజకవర్గం, జిల్లాలోనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.

రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి అబద్ధమా? కాదా? శాటిలైట్‌ చిత్రాల్లో కనిపించడం లేదని కేంద్రం చెబుతోంది. డ్రోన్‌, హెలీకాప్టర్‌, లేదా ఏ కొత్త టెక్నాలజీలతోనైనా సర్వేకు సిద్ధమేనా? మా సవాల్‌ స్వీకరిస్తున్నారా..!

మా గురువులు సంస్కారం, సభ్యత నేర్పారు. మీ భాష నేర్పించలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూసే నేర్చుకుంటున్నా. నరుకుతా, వంచుతా వంటివి మీ మాటలే.

ఉద్యమ సమయంలో దీక్ష మొదలుపెట్టిన వెంటనే విరమించారు. తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో ఓటింగ్‌లో ఎందుకు పాల్గొనలేదు? అంతకన్నా పెద్ద పనేముంది? మీరు తెలంగాణ ద్రోహి కాదా?. కేంద్రమంత్రిగా ఉన్నపుడు మీ మీద కేసులు రాలేదా?.

-బండి సంజయ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని