Telangana News: 15 వరకు శాసనసభ, మండలి సమావేశాలు

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 15 వరకు జరగనున్నాయి. అసెంబ్లీ మరో ఆరు రోజులు పనిచేస్తుంది. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన శాసనసభ కార్యకలాపాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated : 08 Mar 2022 04:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 15 వరకు జరగనున్నాయి. అసెంబ్లీ మరో ఆరు రోజులు పనిచేస్తుంది. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన శాసనసభ కార్యకలాపాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క, చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, విప్‌ గొంగిడి సునీతలు పాల్గొన్నారు. మొదట భట్టి సమావేశానికి వెళ్లలేదు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి నచ్చజెప్పడంతో వచ్చారు. ఈ సందర్భంగా అధికారపక్షం సోమవారంతో కలిసి మొత్తం ఏడు రోజుల పాటు సమావేశాలు జరపాలని ప్రతిపాదించింది. మరిన్ని రోజులపాటు నిర్వహించాలని మజ్లిస్‌, కాంగ్రెస్‌ సభ్యులు కోరినా... ఏడు రోజులకే ప్రభుత్వం మొగ్గు చూపింది. సోమవారం బడ్జెట్‌ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది. మంగళవారం శాసనసభకు సభాపతి పోచారం సెలవు ప్రకటించారు. ఈ నెల 9న సభ తిరిగి సమావేశమవుతుంది. ఆ రోజు బడ్జెట్‌పై, 10, 11, 12, 14 తేదీల్లో డిమాండ్లపై చర్చిస్తారు. 15న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదం తెలుపుతారు.

సీఎంకు మంత్రుల కృతజ్ఞతలు

బడ్జెట్‌లో అన్ని వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి పెద్దపీట వేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ప్రసంగం అనంతరం మంత్రులు గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్‌, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సబితారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీఎంను ఆయన కార్యాలయంలో కలిశారు. బడ్జెట్‌ అద్భుతంగా ఉందని వారు పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డిలు సీఎంను కలిసి బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించారు.

శాసన మండలిలో..

శాసన మండలిలో ఈ నెల 10న బడ్జెట్‌పై సాధారణ చర్చ, ప్రభుత్వ సమాధానం, ఈ నెల 15న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చేపట్టాలని బీఏసీలో నిర్ణయించారు. మంగళ, బుధవారాలు సెలవు ఉంటుంది. ప్రొటెం ఛైర్మన్‌ జాఫ్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి, విప్‌ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డిలు పాల్గొన్నారు. మండలి ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ల ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మరో రోజు సమావేశం జరిగే వీలుందని మంత్రులు చెప్పినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని