Updated : 23 Mar 2022 04:53 IST

Telangana News: దిల్లీకి చేరిన తెలంగాణ మంత్రులు

నేడో రేపో కేంద్ర మంత్రులు, ప్రధానితో భేటీ!

ఎంసీహెచ్‌ఈర్డీలో అధికారులతో సమావేశమైన మంత్రులు

పంజాబ్‌ విధానం రాష్ట్రంలో అమలుకు ప్రతిపాదనలు చేయాలని నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: పంజాబ్‌ తరహాలో తెలంగాణ వడ్లన్నీ కొనేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డిల బృందం మంగళవారం దిల్లీకి చేరుకుంది. తొలుత కేంద్ర మంత్రులను, ఆ తర్వాత ప్రధాన మంత్రిని, సంబంధిత అధికారులను కలుస్తామని మంత్రులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకొని వస్తామని స్పష్టంచేశారు.  అంతకుముందు మంగళవారం ఉదయం మంత్రులు హరీశ్‌రావు, గంగుల, నిరంజన్‌రెడ్డి, అజయ్‌లు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. పంజాబ్‌ విధానాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. పంజాబ్‌ తరహా విధానానికి కేంద్రం అంగీకరిస్తే.. ఐకేపీ, ఇతర సంస్థల ద్వారా తామే ధాన్యం కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి అందజేయడానికి సిద్ధమేనన్న ప్రతిపాదనను ముందుంచాలనే అంశంపై చర్చించారు.

సీఎం కేసీఆర్‌తో భేటీ

సమావేశం అనంతరం మంత్రులు ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవాలని, స్పందన లేకపోతే కేంద్రంపై యుద్ధానికి సిద్ధమవుదామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పీయూష్‌ గోయల్‌ వైఖరిని ఎండగట్టాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రులు దిల్లీ బయల్దేరి వెళ్లారు.

కేంద్ర మంత్రులను నిలదీస్తాం: నిరంజన్‌రెడ్డి, గంగుల

కేంద్రం తీరుతో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. దీనిపై కేంద్ర మంత్రులను నిలదీస్తామని మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ తెలిపారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దిల్లీకి బయల్దేరేముందు వారు విలేకరులతో మాట్లాడారు. ‘‘పంజాబ్‌లో ధాన్యం కొన్నప్పుడు.. తెలంగాణ రైతులు పండిస్తే ఎందుకు కొనరు? కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఏం చేయాలో సీఎం కేసీఆర్‌ నిర్ణయిస్తారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. గతంలో కొన్న ధాన్యాన్ని మరపట్టించి రాష్ట్ర గోదాముల్లో ఎందుకు పెట్టుకుంటాం? బియ్యాన్ని కేంద్రమే తీసుకెళ్లాలి. అందుకు రైళ్లను సమకూర్చకుండా మాపై నిందలు వేయడం విడ్డూరంగా ఉంది. కేంద్ర మంత్రుల నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ముఖ్యమంత్రి ప్రకటించిన కార్యాచరణకు అనుగుణంగా ముందుకెళ్తాం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అర్థరహితంగా మాట్లాడుతున్నారు. ధాన్యం కొనుగోలుపై ఆ శాఖ కేంద్ర మంత్రి లేదా సంబంధిత అధికారులు మాట్లాడాలి. బండి సంజయ్‌కు ఏం సంబంధం? ఒకవేళ కేంద్రం తరఫున చెబితే స్పష్టమైన హామీతో మాట్లాడాలి తప్ప ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎలా? రాష్ట్రం కోసం బండి సంజయ్‌ ఏం చేశారు? ఆయన వల్ల రాష్ట్రానికి ఏం ఒరిగింది? ఏ రాష్ట్రంలో లేని ఇబ్బందులు తెలంగాణ రైతులకు ఎందుకు పెడుతున్నారు. వన్‌ నేషన్‌-వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ఉండాలి. రైతులు వేసిన పంటలన్నింటినీ కేంద్రం కొనాలి. గోధుమలు పండిస్తే పిండి చేసి ఇవ్వడం లేదు. పత్తి పండిస్తే జిన్నింగ్‌ చేసి ఇవ్వడం లేదు. మరి వడ్లు కొంటే బియ్యం ఎందుకు ఇవ్వాలి’’ అని మంత్రులు ప్రశ్నించారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts