KTR: చేనేతపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీ

చేనేత, నేత కార్మికులపై భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతోందని, స్వతంత్ర భారతదేశంలో చేనేతపై పన్నువేసిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ అని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ధ్వజమెత్తారు. కరోనా సంక్షోభంలోనూ జౌళి

Updated : 02 May 2022 04:44 IST

 నేతన్నలపై విషం చిమ్ముతున్న కేంద్రం

మీకు కేంద్రాన్ని నిలదీసే దమ్ముందా?

భాజపా అధ్యక్షుడు సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: చేనేత, నేత కార్మికులపై భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతోందని, స్వతంత్ర భారతదేశంలో చేనేతపై పన్నువేసిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ అని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ధ్వజమెత్తారు. కరోనా సంక్షోభంలోనూ జౌళి రంగంపై మోదీ పన్నుల భారం వేశారని, దీంతో చేనేత రంగం కునారిల్లుతోందని తెలిపారు. చేనేత, జౌళిరంగంపై కేటీఆర్‌ ఆదివారం సంజయ్‌కు బహిరంగ లేఖ రాశారు. నేత కార్మికులపై బీమా సాయం ఎత్తివేయడంతో పాటు జాతీయ చేనేత అభివృద్ధి మండలిని మూసివేసిన పాపాన్ని మోదీ మూట కట్టుకున్నారని లేఖలో విమర్శించారు. చేనేత, జౌళి రంగాలపై కనీస అవగాహన లేకుండా భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలు, ఆయన అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని చాటేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీగా నేత రంగానికి కేటాయింపులు చేస్తున్నది తెలంగాణ సర్కారేనని స్పష్టం చేశారు. నేతన్నల అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ఏ కార్మికుడిని అడిగినా వాస్తవాన్ని తెలియజేస్తారని చెప్పారు. నేతన్నలపై సంజయ్‌కి నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్రంలో జాతీయ జౌళి పరిశోధన సంస్థ, జాతీయ చేనేత సాంకేతిక సంస్థ, మెగా మరమగ్గాల సమూహం ఏర్పాటుపై దిల్లీలో కొట్లాడాలని మంత్రి డిమాండ్‌ చేశారు.

ఇదేం రీతి

‘‘నేతన్నల సంక్షేమం, అభివృద్ధికి అండగా నిలవాల్సిన కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోంది. ఇప్పటికే అనేకసార్లు ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి కాకతీయ మెగా జౌళి పార్కుకు సాయం అందించాలని కోరినా వారు పట్టించుకోలేదు. మరోవైపు తన అబద్ధాలతో సంజయ్‌ ప్రజలపై దండయాత్ర చేస్తున్నారు. ఆయన తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం పార్లమెంట్‌లో ఒక్కమాటా మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వల్ల జౌళిరంగంలో బంగ్లాదేశ్‌, శ్రీలంక లాంటి చిన్న దేశాల కన్నా భారత్‌ వెనుకబడి ఉంది. జౌళి ఉత్పత్తులపైన భారీగా జీఎస్టీ వసూలు చేస్తూ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టిన దుర్గార్మపు ప్రభుత్వం భాజపాది. చేనేతపైన జీఎస్టీని సంపూర్ణంగా ఎత్తివేయాలని పలుమార్లు లేఖలు రాసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినా.. కేంద్రం కనికరించలేదు.

తెలంగాణను చూసి నేర్చుకోండి

తెలంగాణ ప్రభుత్వం నేతన్నలను కంటికి రెప్పలా చూసుకుంటోంది. వారికోసం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని స్థాయిలో విప్లవాత్మక కార్యక్రమాలను మా సర్కారు చేపట్టింది. నేతన్న రుణాలను మాఫీ చేసింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా చేనేత కార్మికులకు 40 శాతం సబ్సిడీని చేనేతమిత్రలో ఇస్తున్నాం. నేతన్నకు చేయూత పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకం నేతన్నలకు కరోనా సంక్షోభ సమయంలో ఆపన్నహస్తం అందించింది. మగ్గాల అధునికీకరణ నుంచి వర్కర్‌ టూ ఓనర్‌ పథకం వరకు మా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో ఈరోజు రాష్ట్రంలోని నేతన్నల ఆదాయం రెట్టింపైంది. మా సర్కారు చేపట్టిన అనేక కార్యక్రమాలతో జౌళి రంగంలోనూ వలసలు వాపసవుతున్నాయి. నేతన్నలకు అన్ని బీమా పథకాలను మీరు రద్దుచేస్తే మా ప్రభుత్వం బీమా కల్పిస్తూ మేలు చేస్తోంది. ప్రధానితో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక జౌళి పార్కును సాధించి తీసుకువచ్చే దమ్ము సంజయ్‌కుందా? కేంద్రాన్ని నిలదీస్తారా? అసత్యాలతో మోసం చేయాలని చూస్తే రాష్ట్రంలోని నేతన్నలు భాజపా నాయకులకు బుద్ధి చెప్పడం ఖాయం.’’ అని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని