సి.నరసింహారావు మృతి తీరని లోటు

ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు మృతి సమాజానికి తీరని లోటు అని లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ విచారం వ్యక్తం చేశారు. ‘చక్కటి

Published : 23 May 2022 04:16 IST

‘రేపటి మనిషి’ పుస్తకావిష్కరణలో వక్తలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు మృతి సమాజానికి తీరని లోటు అని లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ విచారం వ్యక్తం చేశారు. ‘చక్కటి పరిజ్ఞానం ఉండి, దాన్ని విస్తరింపజేసి, వాక్చాతుర్యంతో, వాదనా పటిమతో ఒప్పించగల వ్యక్తి నరసింహారావు. మరో పదిహేనేళ్లపాటు తన ఆలోచనలను పంచే శక్తి ఉన్న ఆయన హఠాత్తుగా అందరినీ విడిచి వెళ్లిపోవడం బాధాకరం’ అని ఆయన ఆవేదన చెందారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో ఏర్పాటు చేసిన నరసింహారావు సంస్మరణ సభకు హాజరైన వక్తలు ఆయన సేవలను ప్రస్తుతించారు. ఆయన జ్ఞాపకాలతో సన్నిహిత ప్రముఖులు రచించిన ‘రేపటి మనిషి’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సభలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, ‘నరసింహారావు నాకు ప్రాణ స్నేహితుడు. ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడే ఆయన ఎప్పటికీ అందరి మనసుల్లో చిరంజీవే’ అన్నారు. నరసింహారావు తనకు మానసిక గురువని, అలాంటి జర్నలిస్టును తన జీవితంలో వేరొకరిని చూడలేదని ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గుర్తుచేసుకున్నారు. మరో ఎంపీ సుజనాచౌదరి మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా నరసింహారావు విశ్లేషణ ఉండేదని, సైకో ఫ్యాన్సీ ఆయన లక్షణం కానే కాదని అన్నారు. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆయన బాధితుల పక్షాన నిలబడి వారి ఇక్కట్లను ప్రపంచానికి తెలిపారని, వారి మనోవిశ్లేషణలు రాశారని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. మరో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కూడా నరసింహారావు ప్రత్యేకతలను కొనియాడారు. ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్‌ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ, ‘నరసింహారావులోని విలక్షణతలు మరికొందరిలో ఉండవచ్చేమో కానీ, ఆయనలోని నిర్భీతి అనే గుణం మాత్రం ఎవరు అనుసరించాలన్నా కష్టసాధ్యం.  తాను నిజమని నమ్మింది, తనకు తెలిసింది కుండబద్దలు కొట్టి చెప్పడానికి సంకోచించని వ్యక్తి. మనల్ని నాశనం చేసేది మన ఆలోచనలే తప్ప, మన శత్రువులు కాదని తరచూ చెప్పేవారు’ అని అన్నారు. కార్యక్రమ వ్యాఖ్యాతగా గజల్‌ శ్రీనివాస్‌ వ్యవహరించారు. ఏపీ పోలీసు ఉన్నతాధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణ, సీనియర్‌ సంపాదకులు కె.రామచంద్రమూర్తి, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, ఏపీ ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్‌, డా.కృష్ణయ్య, గుమ్మడి గోపాలకృష్ణ, రఘు ఏలూరి, సి.ఉమామహేశ్వరరావు, సుంకర కోటేశ్వరరావు, తుమ్మల గోపాలరావు, పాత్రికేయులు మూర్తి, రమేశ్‌ కందుల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని