రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. ఐఎస్‌బీలో 2వేల మంది పోలీసుల మోహరింపు

ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26న నిర్వహించే ఐఎస్‌బీ ద్విదశాబ్ది వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్‌ వస్తున్న సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకొని.

Updated : 25 May 2022 07:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26న నిర్వహించే ఐఎస్‌బీ ద్విదశాబ్ది వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్‌ వస్తున్న సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకొని.. హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) ఆవరణలో దిగుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో గచ్చిబౌలిలోని ఐఎస్‌బీకి చేరుకుంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఐఎస్‌బీతోపాటు బేగంపేట విమానాశ్రయం, హెచ్‌సీయూలలో భారీ ఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. ఒక్క ఐఎస్‌బీలోనే 2వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. సైబరాబాద్‌ ఇన్‌ఛార్జి కమిషనర్‌ సీవీ ఆనంద్‌ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  బుధవారం నుంచే ఈ ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.

విద్యార్థుల సామాజిక మాధ్యమాల ఖాతాల తనిఖీ
ఐఎస్‌బీ ద్విదశాబ్ది వార్షికోత్సవాల్లో హైదరాబాద్‌, మొహాలీ ప్రాంగణాలకు చెందిన దాదాపు 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనలో ఎక్కడా అపశ్రుతులు దొర్లకుండా విద్యార్థుల సామాజిక మాధ్యమాలను తనిఖీ చేసి, ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక భావాలు కలిగి ఉన్నట్లు గుర్తిస్తే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని చేతులమీదుగా పట్టాలు అందుకునే పది మంది విద్యార్థుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐఎస్‌బీ సిబ్బంది పూర్వాపరాలు కూడా ఒకటికి రెండుసార్లు పరిశీలించి నిర్ధారించుకుంటున్నారు.

ఐఎస్‌బీ విద్యార్థులపై నిఘా అప్రజాస్వామికం: నారాయణ
ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతున్న నేపథ్యంలో అక్కడి విద్యార్థులపై నిఘా పెట్టడం అత్యంత అప్రజాస్వామిక చర్యని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. భావ వ్యక్తీకరణ రాజ్యాంగం ఇచ్చిన హక్కని అన్నారు. నియంతృత్వ ధోరణిలో విద్యాసంస్థలను నడిపితే.. అక్కడి విద్యార్థులు సమాజానికి ఎలా ఉపయోగపడతారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులపై నిఘా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇప్పటికైనా విద్యార్థులందరినీ వార్షికోత్సవంలో భాగస్వాములను చేయాలని నారాయణ డిమాండ్‌ చేశారు.

స్వాగతం పలకనున్న సీఎస్‌
ఈనాడు, హైదరాబాద్‌: ప్రధానికి విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ స్వాగతం పలకనున్నారు. సీఎం కేసీఆర్‌ బెంగళూరు పర్యటన దృష్ట్యా ప్రధాని కార్యక్రమానికి హాజరుకావడం లేదు. దీంతో సీఎస్‌ అక్కడికి వెళ్తున్నట్లు ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు  మోదీకి ఎయిర్‌పోర్టులో పార్టీపరంగా ఘనస్వాగతం పలికేందుకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మోదీ కొద్దిసేపు మాట్లాడతారని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని