ఏడాదిలో రూ.15కోట్లు తిరిగొచ్చాయ్‌!

హైదరాబాద్‌కు చెందిన ప్రేరణను సైబర్‌ నేరస్థుల ముఠా బిట్‌కాయిన్‌ పెట్టుబడుల పేరుతో మోసం చేసి పలు ఖాతాలకు రూ.11లక్షలను బదిలీ చేయించుకుంది. ఆమె జూన్‌ 18న హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులతోపాటు తెలంగాణ సైబర్‌క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌(టీ4సీ)కు ఫిర్యాదు చేశారు.

Published : 03 Jul 2022 05:26 IST

సైబర్‌ నేరస్థులు కాజేసిన సొమ్ము సురక్షితం
టీ4సీ సత్వర స్పందనతో బాధితులకు ఉపశమనం

ఈనాడు, హైదరాబాద్‌ : హైదరాబాద్‌కు చెందిన ప్రేరణను సైబర్‌ నేరస్థుల ముఠా బిట్‌కాయిన్‌ పెట్టుబడుల పేరుతో మోసం చేసి పలు ఖాతాలకు రూ.11లక్షలను బదిలీ చేయించుకుంది. ఆమె జూన్‌ 18న హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులతోపాటు తెలంగాణ సైబర్‌క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌(టీ4సీ)కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన టీ4సీ బృందం ఐడీబీఐ బ్యాంకు నోడల్‌ అధికారులను సంప్రదించింది. రూ.11లక్షలను మోసగాళ్లకు చిక్కకుండా ఫ్రీజ్‌ చేయించి ఆ డబ్బుని తిరిగి బాధితురాలి ఖాతాకు రప్పించారు. ఇలా ఏడాది కాలంలో టీ4సీ ఏకంగా రూ.15కోట్లకుపైగా సొమ్మును తిరిగి బాధితుల చెంతకు చేర్చింది. సైబర్‌నేరాలు పెచ్చరిల్లిపోవడంతో కేంద్ర హోంశాఖ www.cybercrime.gov.in వెబ్‌సైట్తోపాటు హెల్ప్‌లైన్‌ నంబరు 1930ని ఏర్పాటు చేసింది. ఇదేక్రమంలో తెలంగాణ పోలీసులు టీ4సీని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో సిబ్బంది 24గంటలూ అందుబాటులో ఉంటుండటంతో తెలంగాణ నుంచి 1930కు వచ్చే ఫోన్‌కాల్స్‌కు వెంటనే స్పందిస్తున్నారు.

సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌తో అనుసంధానం

దేశవ్యాప్తంగా బాధితుల నుంచి హెల్ప్‌లైన్‌ నంబరుకు వచ్చే ఫిర్యాదుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌) ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా ఆయా రాష్ట్రాల సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఈ పోర్టల్‌లో వివరాలను నమోదు చేస్తున్నారు. సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌ సిబ్బంది బాధితుల వివరాలు అన్ని బ్యాంకులతోపాటు ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సంస్థల నోడల్‌ అధికారులకు వెంటనే చేర్చుతున్నారు. దీంతో సైబర్‌ నేరస్థుల ఖాతాలకు బదిలీ అయిన సొమ్మును డ్రా చేయకుండా ఫ్రీజ్‌ చేయించగలుగుతున్నారు. తెలంగాణలో టీ4సీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇలా రూ.15,47,61,501లను బాధితులకు తిరిగి ఇప్పించగలిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని