Corona Virus: కరోనా పెరుగుతోంది... కట్టడిచేయండి

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణల్లో ఈ పెరుగుదల అధికంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ వ్యాప్తి

Updated : 07 Aug 2022 06:13 IST

తెలంగాణకు కేంద్రం లేఖ

ఈనాడు-దిల్లీ, హైదరాబాద్‌: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణల్లో ఈ పెరుగుదల అధికంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకోవాలంటూ ఆయా రాష్ట్రాలన్నింటికి ప్రత్యేకంగా లేఖలు రాసింది. ఇందులో భాగంగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎన్‌.ఎ.ఎం.రిజ్వీకి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ రాసిన లేఖలో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించారు. తక్షణం కట్టుదిట్టమైన కట్టడి చర్యలు చేపట్టాలని సూచించారు. అదే సమయంలో 12 జిల్లాల్లో పరీక్షల సంఖ్యను తగ్గించడాన్ని తప్పుబట్టారు. ‘‘గత నెలరోజులుగా తెలంగాణలో కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి. అవి దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 5.7 శాతంగా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 5.67 శాతం నుంచి 7.34 శాతానికి చేరింది. రాష్ట్రంలో 12 జిల్లాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు వారం రోజులుగా తగ్గాయి. అదే సమయంలో నాలుగు జిల్లాల్లో కేసులు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో  పండగలు, పర్వదినాల సందర్భంగా భారీగా ప్రజలు గుమిగూడే అవకాశముంది. వైరస్‌ వ్యాధులు, కరోనా ప్రబలే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్‌, యాంటీజెన్‌ పరీక్షల సంఖ్య పెంచాలి. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించి జీనోమ్‌ సీక్వెన్స్‌ నిర్వహించాలి. 2022 సెప్టెంబరు 30 నాటికి 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్‌ డోసు అందించాలి’’ అని లేఖలో సూచించారు.

మార్కెట్లు, బస్టాండ్లు, కాలేజీలు, రైల్వేస్టేషన్లలో ప్రజలు కొవిడ్‌ అనుబంధ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.

ప్రస్తుతం వైరస్‌ లక్షణాలు, రోగ చికిత్స విధానాల్లో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలవారీగా ఇన్‌ఫ్లుయెంజా తరహా అనారోగ్యాలు, తీవ్ర శ్వాసకోశ సంబంధ సమస్యలకు సంబంధించిన కేసులను గుర్తించాలి. ప్రాథమిక దశలోనే హెచ్చరిక సంకేతాలను తెలుసుకోవడానికి అన్ని ఆసుపత్రుల్లో ఇలాంటి రోగులపై దృష్టిసారించి వెంటనే నివేదించాలి. దీనివల్ల ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.

పరీక్ష, పరిశీలన, చికిత్స, వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ అనువైన ప్రవర్తన అన్న అయిదు సూత్రాలను విధిగా రాష్ట్రాలు అమలు చేయాలి.

తెలంగాణ ప్రభుత్వం కొవిడ్‌-19 ఇండియా పోర్టల్‌లో గత ఆరునెలలుగా కొవిడ్‌-19 హాట్‌స్పాట్‌ ఫామ్‌ని భర్తీచేయలేదు. లోపాలను వేగంగా సరిదిద్దడానికి అది అతిముఖ్యం. వేగంగా, నిరంతరంగా డేటాను అప్‌డేట్‌ చేయడం వల్ల కేసులను ట్రాక్‌ చేయడానికి వీలవుతుంది.


కొత్తగా 652 కరోనా కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం 652 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,25,360కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 40,451 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 220, రంగారెడ్డి జిల్లాలో 46, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 41 పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో రెండు రోజుల్లో ఏడుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు