Kadem Project: కుదుటపడుతున్న కడెం

గత నెలలో వచ్చిన వరదలకు వణికించిన నిర్మల్‌ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి డ్యాం వరద గేట్లను వేగంగా మరమ్మతు చేస్తున్నారు. గత నెల 13, 14వ తేదీల్లో వచ్చిన వరదకు డ్యాంకు ఉన్న 18 గేట్లు స్తంభించిన విషయం

Updated : 08 Aug 2022 06:11 IST

2, 3 రోజుల్లో డ్యాంలో నీటి నిల్వ!

వేగంగా సాగుతున్న గేట్ల మరమ్మతు

ఈనాడు, హైదరాబాద్‌: గత నెలలో వచ్చిన వరదలకు వణికించిన నిర్మల్‌ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి డ్యాం వరద గేట్లను వేగంగా మరమ్మతు చేస్తున్నారు. గత నెల 13, 14వ తేదీల్లో వచ్చిన వరదకు డ్యాంకు ఉన్న 18 గేట్లు స్తంభించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి జలాశయంలో నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది. ఒక్కో గేటును పరిశీలించి వరదతో కొట్టుకువచ్చి అడ్డుగా నిలిచిన మొద్దులు, కొమ్మలు, మట్టిని తొలగిస్తున్నారు. ఒక్కో గేటును పూర్తిగా రబ్బరు సీళ్లపై కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం వరకు 10 గేట్లను దించారు. ఈ జలాశయం వరద విడుదల సామర్థ్యం 2.90 లక్షల క్యూసెక్కులుకాగా.. 5 లక్షల క్యూసెక్కులను మించి ప్రవాహం వచ్చింది. వరద ధాటికి 2 గేట్ల కౌంటర్‌ వెయిట్లు విరిగాయి. స్వప్న ఇంజినీరింగ్‌ వర్క్స్‌ సంస్థ పనులు చేపడుతోంది. ఈనెల 25లోపు మరమ్మతు చేయాలనేది లక్ష్యంకాగా.. అంతకుముందే పనుల పూర్తికి నిపుణులు, డ్యాం ఇంజినీర్లు కృషి చేస్తున్నారు. 2, 3 రోజుల్లో దశలవారీగా నీటిని నిల్వ చేయాలని భావిస్తున్నారు.]

మళ్లీ ఆగస్టుకు వచ్చిన సాగు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని జన్నారం, కడెం, దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాల్లో ఆయకట్టుకు ఈ ప్రాజెక్టునుంచే సాగునీరు అందుతుంది. డ్యాం సామర్థ్యం 7.60 టీఎంసీలు. కొన్నేళ్ల వరకు ఆగస్టు మొదటివారం తరువాతే ఇక్కడ పంటల సాగు చేపట్టేవారు. జులైలోనే సాగు మొదలుపెట్టేలా రైతులను నీటిపారుదల శాఖ సిద్ధం చేసింది. అయితే.. ఈ ఏడాది ప్రాజెక్టులో నీటి నిల్వకు అవకాశం లేకపోవడంతో సాగు ఆలస్యం కానుంది. అయినప్పటికీ ఈనెల 15నాటికి నీటిని నిల్వ చేసి కాల్వలకు విడుదల చేసేందుకు ఇంజినీర్లు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ముప్పు రాకుండా డ్యాం పునరాకృతిపైనా నీటిపారుదల శాఖ అధ్యయనం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని