పట్టు ధరలు పెరిగాయ్‌.. మల్బరీ పండిస్తారా

రాష్ట్రంలో ఏడాది కాలంలో కిలో పట్టు ధర 20 నుంచి 30 శాతం పెరిగింది. దీన్ని రైతులకు ఆదాయంగా మార్చడానికి పట్టుపురుగుల పెంపకం, వాటికి ఆహారమైన మల్బరీ సాగు విస్తీర్ణం పెంచాలని రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ ప్రణాళిక

Published : 08 Aug 2022 06:20 IST

రాష్ట్రంలో సాగు పెంపునకు ప్రణాళిక సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏడాది కాలంలో కిలో పట్టు ధర 20 నుంచి 30 శాతం పెరిగింది. దీన్ని రైతులకు ఆదాయంగా మార్చడానికి పట్టుపురుగుల పెంపకం, వాటికి ఆహారమైన మల్బరీ సాగు విస్తీర్ణం పెంచాలని రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ ప్రణాళిక తయారుచేసింది. ఆయిల్‌పాం తోటల్లో అంతరపంటగా మల్బరీ వేయించాలని నిర్ణయించింది. పట్టుగూళ్ల ఉత్పత్తి షెడ్‌ నిర్మాణానికి రూ.2.50 లక్షల వరకూ కేంద్రం రాయితీగా ఇస్తుండగా.. పట్టుగూళ్లను ఉత్పత్తి చేసి విక్రయిస్తే కిలోకు రూ.75 చొప్పున రాష్ట్రం ప్రోత్సాహకంగా ఇస్తోంది. టస్సార్‌ పట్టుగూళ్ల ఉత్పత్తికి ఉపాధిహామీ పథకం కింద సాయం చేస్తున్నారు. మల్బరీ సాగు రైతులకు ఈ పథకం కింద తొలి ఏడాది ఎకరాకు రూ.53 వేలు, తర్వాత రెండేళ్లు రూ.36 వేల చొప్పున సాయం చేస్తున్నట్లు పట్టు పరిశ్రమశాఖ తెలిపింది. ‘‘పట్టుగూళ్ల ధరలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. మల్బరీ సాగులో ఏటా ఎకరాకు రూ.లక్షకు పైగా లాభం వస్తోంది’’ అని రాష్ట్ర పట్టుపరిశ్రమ సమన్వయ కమిటీ సభ్యుడు పుండరీకం తెలిపారు.

ఉత్పత్తి కంటే మూడు రెట్ల డిమాండ్‌

దేశంలో వార్షిక పట్టు డిమాండ్‌: 65,500 టన్నులు

ప్రస్తుత ఉత్పత్తి: 36,152 టన్నులు

మల్బరీ సాగు: 5.61 లక్షల ఎకరాలు

అత్యధికంగా కర్ణాటకలో 2.50 లక్షల ఎకరాలు, ఏపీలో లక్ష, తమిళనాడులో 40 వేలు, తెలంగాణలో 14 వేల ఎకరాల్లో పండిస్తున్నారు.

రాష్ట్రంలో 9 వేల మరమగ్గాలపై పట్టువస్త్రాల తయారీకి ఏటా 984 టన్నుల పట్టుదారం అవసరం. ఇక్కడ 306 టన్నులే ఉత్పత్తి అవుతుండడంతో మిగతాది ఇతర రాష్ట్రాల నుంచి కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని