ఆలమట్టి నుంచి ప్రకాశం వరకు మహా ప్రవాహం

కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న వర్షాలకు భారీ ప్రవాహం దిగువకు వస్తోంది. కృష్ణా నదిలో ఆలమట్టి నుంచి ఏపీలోని ప్రకాశం బ్యారేజీ వరకు

Published : 13 Aug 2022 04:52 IST

కృష్ణాలో అన్నిచోట్లా రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద
ప్రాణహిత ఉద్ధృతితో గోదావరికి వరద

ఈనాడు, హైదరాబాద్‌, నాగార్జునసాగర్‌, భద్రాచలం, న్యూస్‌టుడే:కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న వర్షాలకు భారీ ప్రవాహం దిగువకు వస్తోంది. కృష్ణా నదిలో ఆలమట్టి నుంచి ఏపీలోని ప్రకాశం బ్యారేజీ వరకు ఎక్కడ చూసినా రెండు లక్షల క్యూసెక్కులకు తగ్గకుండా వరద ప్రవహిస్తోంది. కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్‌ జలాశయాల నుంచి రెండు లక్షలకుపైగా క్యూసెక్కులు దిగువకు వస్తున్నాయి. జూరాల నుంచి కూడా అదే స్థాయి నీటి విడుదల ఉంది. శ్రీశైలం జలాశయం వద్దకు వస్తే తుంగభద్ర నుంచి లక్ష క్యూసెక్కులు వచ్చి కలుస్తుండటంతో వరద స్థాయి పెరుగుతోంది. ఇన్‌ఫ్లో 4.55 లక్షలకుపైగా ఉండగా దిగువకు అంతేస్థాయిలో వదులుతున్నారు. నాగార్జునసాగర్‌కు భారీ వరద కొనసాగుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా 26 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. 24 గేట్లను పది అడుగుల మేర, రెండు గేట్లు 5 అడుగుల మేరకు ఎత్తి విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సాగర్‌ జలాశయం 587.10(గరిష్ఠం 590.00)అడుగులకు చేరగా నీటినిల్వ సామర్థ్యం 305.8030 (గరిష్ఠం.312.0540)వద్ద ఉంది. ఈ వరద పులిచింతల, ప్రకాశం బ్యారేజీల నుంచి సముద్రంలోకి వెళ్తోంది. మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు వార్ధా, పెన్‌గంగ నదులకు భారీ వరద వస్తోంది. దీంతో ప్రాణహిత ఉప్పొంగుతోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. శుక్రవారం సాయంత్రానికి ఇక్కడి నుంచి 11.18 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వదులుతున్నారు. ఎస్సారెస్పీ నుంచి అన్నారం బ్యారేజీల వరకు పెద్దగా ప్రవాహాలు లేవు.

భద్రాచలం వద్ద గోదావరి వరద తాకిడి కొంత తగ్గినప్పటికీ ఇంకా అంతరాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు పునరుద్ధరణ కాలేదు. శుక్రవారం ఉదయం 5 గంటలకు 52.5 అడుగులకు చేరిన నీటిమట్టం కొద్ది గంటలు నిలకడగా మారింది. సాయంత్రం 5 గంటలకు మూడు పాయింట్లు తగ్గి 52.2 అడుగులకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నుంచి భద్రాచలానికి వచ్చే దగ్గరి దారి మునగడంతో మరో మార్గం గుండా రావాల్సి వస్తోంది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం రాయనపేట వద్ద రోడ్డుపై వరద నీటిలో కారుకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా వైపు వెళ్లేందుకు వీలులేకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భద్రాచలం-దుమ్ముగూడెం మండలాల మధ్యలో బస్సులు తిరిగే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం గోదావరి స్నానఘాట్‌లోకి ఎవర్నీ వెళ్లనీయకుండా పోలీసులు బందోబస్తు పాటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని