భద్రాద్రి రామయ్య భూమికి చెర

భద్రాద్రి రామయ్యకు చెందిన భూమిలో ఆక్రమణల పరంపర కొనసాగుతోంది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో దేవస్థానానికి సుమారు 900 ఎకరాలుంది. వీటిలో సుమారు 200 ఎకరాలు మాత్రమే దేవాదాయశాఖ అధీనంలో ఉంది.

Published : 01 Oct 2022 05:53 IST

రూ. కోట్ల విలువైన మాన్యాలు అన్యాక్రాంతం

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాద్రి రామయ్యకు చెందిన భూమిలో ఆక్రమణల పరంపర కొనసాగుతోంది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో దేవస్థానానికి సుమారు 900 ఎకరాలుంది. వీటిలో సుమారు 200 ఎకరాలు మాత్రమే దేవాదాయశాఖ అధీనంలో ఉంది. మిగిలినదంతా రైతుల సాగుబడిలో ఉంది. ఈ భూమిలో జామాయిల్‌ వంటివి సాగు చేస్తూ దేవాదాయశాఖకు నామమాత్రంగా కౌలు చెల్లించేవారు. కొద్దికాలంగా చాలామంది అది కూడా చెల్లించడంలేదు. ప్రస్తుతం మిగిలి ఉన్న 200 ఎకరాలు కూడా క్రమేపీ ఆక్రమణలకు గురవుతోంది.

ఎకరం రూ. 4 కోట్లు

భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో పురుషోత్తపట్నం ఉంటుంది. ఇక్కడ భూమి ధర ఎకరా సుమారు రూ.3-4 కోట్లు పలుకుతోంది. రెండు వారాల కిందట 15 ఎకరాలు తమదేనంటూ ఓ వ్యక్తి ఆ స్థలాన్ని చదును చేశాడు. సుమారు రూ.50 కోట్ల విలువైన భూమిలో కంచె నిర్మించాడు. సమీపంలో మరో వ్యక్తి ఎకరం ఆక్రమించుకుని జామాయిల్‌ మొక్కలు నాటాడు.

తాజాగా మరికొందరు..

పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన మరికొందరు గోశాల సమీపంలో శుక్రవారం సుమారు 10 ఎకరాలను ఆక్రమించడం మొదలుపెట్టారు. యంత్రంతో కంప చెట్లను తొలగిస్తున్నారు. ఆక్రమణదారుల్లో బడాబాబులు, రాజకీయ నాయకులు ఉండడంతో అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. శుక్రవారమే ఆలయానికి చెందిన జాగాలో కొందరు పాకను నిర్మించి.. అందులో ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎటపాక మండలం పేరిట బ్యానర్‌ను ప్రదర్శించి గిరిజన చట్టాలను అమలు చేయాలని పేర్కొన్నారు.

నోటీసులు జారీ చేస్తాం: ఈవో శివాజీ

రాముడి భూములను ఆక్రమించుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. అన్ని ఆధారాలతో ఆక్రమణదారులకు నోటీసులిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని