10 వరకు నీట్‌ పీజీ ప్రవేశాల్లో కన్వీనర్‌ కోటా ఖరారు చేయొద్దు

నీట్‌ పీజీ కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపు ప్రక్రియను ఈ నెల 10 వరకు ఖరారు చేయరాదని కాళోజీ యూనివర్సిటీని ఆదేశిస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 07 Oct 2022 03:28 IST

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌ పీజీ కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపు ప్రక్రియను ఈ నెల 10 వరకు ఖరారు చేయరాదని కాళోజీ యూనివర్సిటీని ఆదేశిస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వారికి ఇన్‌సర్వీసు కోటా కేటాయింపుపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని యూనివర్సిటీతోపాటు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇన్‌సర్వీసు కోటాకు రిజర్వేషన్‌లు అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ డాక్టర్‌ దినేష్‌కుమార్‌ మరో ముగ్గురు గురువారం భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి అనుమతించిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ సీహెచ్‌ సుమలతలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సామా సందీప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు పీజీ అడ్మిషన్‌లలో 20 నుంచి 30 శాతం రిజర్వేషన్‌లు అమలు చేయాల్సి ఉండగా చేయడం లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్లు, పట్టణ ప్రాంతాల్లో ఆరేళ్ల సర్వీసు ఉన్నవారికి పీజీ కోర్సుల్లో రిజర్వేషన్‌లు కల్పించాల్సి ఉందన్నారు. సర్వీసు కోటా కింద పిటిషనర్లు అర్హులైనప్పటికీ వారి అభ్యర్థన తిరస్కరణకు గురైందన్నారు. వర్సిటీ తరఫు న్యాయవాది ప్రభాకర్‌రావు వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు పనిచేస్తున్నవాటిని గ్రామీణ ప్రాంతాలుగా పరిగణించలేమని, అవి మున్సిపల్‌ కార్పొరేషన్‌లని చెప్పారు. అన్ని అంశాలను పరిశీలించిన ధర్మాసనం రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌ తీరును తప్పుబట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేశారని, రిజర్వేషన్‌లకు అర్హులని పిటిషనర్లకు  ఓవైపు ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి మరోవైపు రిజర్వేషన్‌లు ఇవ్వరాదని యూనివర్సిటీకి చెప్పడం అయోమయంగా ఉందని వ్యాఖ్యానించింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts