Telangana News: రంగులు మార్చే రాశిగుట్ట రహస్యం ఇదే!

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల సరిహద్దులోని రాశిగుట్టకు ఓ ప్రత్యేకత ఉంది.

Updated : 30 Nov 2022 08:44 IST

వీర్నపల్లి, న్యూస్‌టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల సరిహద్దులోని రాశిగుట్టకు ఓ ప్రత్యేకత ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలోని ఈ గుట్టపైకి చేరుకోగానే శరీరం రంగులు మారుతుందని స్థానికులు నమ్ముతారు. ఈ గుట్టపై ఆంజనేయస్వామి ఆలయం సైతం ఉంది. చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి మంగళవారం ఈ ఆలయాన్ని సందర్శించారు. ఈ గుట్టపైకి చేరుకోగానే శరీరంలో రంగుల మార్పుపై పరిశోధించారు. ఆ వివరాలను వెల్లడించారు.

‘‘రాశిగుట్ట పైభాగాన లేటరైట్‌ శిలలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతం కారణంగా లేటరైట్‌ క్యాపింగ్‌ ఏర్పడుతుంది. వర్షాలకు పైనుంచి కొట్టుకు వచ్చిన చిన్నచిన్న లేటరైట్‌ శిలల కారణంగా నిటారుగా ఉన్న పర్వతాన్ని చెప్పులతో ఎక్కేందుకు వీలుపడదు. ఈ రాళ్లు.. నీరు, గాలి, వాతావరణానికి ఆక్సీకరణం చెంది మెత్తగా మారడంతో పాటు జాజు, పసుపు, నారింజ రంగులను సంతరించుకుంటాయి. గుట్టపైకి ఎక్కే వారిపై ఈ రంగులోని ధూళి పడటంతో చేతులు, కాళ్లు మాత్రమే పసుపు రంగులో కనిపిస్తాయి. శరీర వర్ణంలో ఎలాంటి మార్పు ఉండదు’’ అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి, గుట్టపైకి చేరుకునేలా గుర్తులు ఏర్పాటు చేయించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని