తెలంగాణపై అసూయతోనే సింగరేణి ప్రైవేటీకరణ
తెలంగాణ అభివృద్ధిపై అసూయతో, ఇక్కడి విజయ ప్రస్థానాన్ని దెబ్బ కొట్టాలన్న కుట్రతోనే కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరిస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ధ్వజమెత్తారు.
ఆయువుపట్టును దెబ్బకొట్టే యత్నం
ప్రజాఉద్యమం తప్పదు
రాష్ట్ర ఎంపీలంతా పార్లమెంటులో గళమెత్తాలి
‘కేంద్ర ప్రభుత్వ కుట్రల’ పేరిట లేఖలో కేటీఆర్ ధ్వజం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిపై అసూయతో, ఇక్కడి విజయ ప్రస్థానాన్ని దెబ్బ కొట్టాలన్న కుట్రతోనే కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరిస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు తాజాగా పార్లమెంటులో బొగ్గు గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించడం కేంద్రం నిజస్వరూపాన్ని బయటపెట్టిందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రధాని మోదీ రాష్ట్రానికి వ్యతిరేకంగా అన్ని రంగాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే రాష్ట్రాభివృద్ధికి ఆయువుపట్టు అయిన సంస్థను దెబ్బతీసేందుకు కేంద్రం సిద్ధమైందన్నారు. సింగరేణికి బొగ్గుగనులు కేటాయించాలన్న తెలంగాణ సర్కారు అభ్యర్థనను పట్టించుకోకుండా, ప్రధాని సొంత రాష్ట్రంలోని గుజరాత్ ఖనిజాభివృద్ధి సంస్థ(జీఎండీసీ)కు గనులు ఇచ్చుకున్నారని తెలిపారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వ కుట్రల పేరిట కేటీఆర్ గురువారం లేఖను విడుదల చేశారు.
ఎన్నాళ్లీ వివక్ష..?
‘‘దక్షిణాది థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన సింగరేణి అటు ఉత్పత్తిలోనూ, లాభాలు, పీఎల్‌ఎఫ్‌లోనూ రికార్డు సృష్టిస్తోంది. సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ రామగుండంలో ప్రధాని ప్రకటించిన కొద్ది రోజులకే కేంద్రం బొగ్గు గనులను వేలం వేసింది. సింగరేణిని కూడా అంతిమంగా కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు మోదీ పూనుకున్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని రాష్ట్రప్రజలు, కార్మికులు పదేపదే కేంద్రాన్ని కోరినా పెడచెవిన పెట్టింది. మరోవైపు మోదీ ప్రధాని కాగానే 2014 ఆగస్టులోనే లిగ్నైట్ గనులను జీఎండీసీకి ఇచ్చారు. 2015 జులై 27న వాటిని అధికారికంగా దానికి కేటాయించారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే తెలంగాణ చీకటిమయమవుతుంది. కార్మికులు శ్రమదోపిడీకి గురవుతారు. వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాలలో రిజర్వేషన్లు, వారికిచ్చే బోనసులు, అలవెన్సులు, సంక్షేమ కార్యక్రమాలు రద్దవుతాయి.
ఇప్పటికే సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రలపై ఉద్యోగులు, కార్మికుల పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. వారికి తెరాస అండగా ఉంటోంది. గనుల వేలంపై కేంద్రం మొండిగా ముందుకెళితే తెలంగాణ ఉద్యమం మాదిరే కార్మికుల తరఫున తెరాస తప్పక మరోసారి పోరాటం చేస్తుంది. సింగరేణి మెడపై కేంద్రం కత్తి పెడితే భాజపా సారథ్యంలోని కేంద్రంపై ప్రజలు వేటువేయడం ఖాయం. తెరాస ఎంపీలు బొగ్గు గనుల వేలం అంశంపై కేంద్రాన్ని నిలదీస్తారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతి పార్లమెంట్ సభ్యుడు కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తాలి. నిబద్ధతను చాటుకోవాలి. ప్రజానీకమూ కలిసిరావాలి’’ అని కేటీఆర్ కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. 42మంది మృత్యువాత
-
General News
KTR: అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
-
India News
Beating Retreat: సైనిక విన్యాసాలు భళా.. 3,500 డ్రోన్లతో మెగా షో.. వీక్షించండి
-
Sports News
Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్ ఖాతాలో పదో టైటిల్.. మొత్తంగా 22వ గ్రాండ్‌స్లామ్
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం