వేతన సవరణను ఆమోదించకపోతే పాదయాత్ర

‘వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారానికి 2019 నుంచి ప్రభుత్వం హామీలు ఇస్తుందే తప్ప అమలు చేయడం లేదు.

Published : 09 Dec 2022 04:50 IST

ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారానికి 2019 నుంచి ప్రభుత్వం హామీలు ఇస్తుందే తప్ప అమలు చేయడం లేదు. శనివారం నిర్వహించే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వేతన సవరణతోపాటు కార్మిక సంఘాల పునరుద్ధరణ తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో మునుగోడు నుంచి హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వరకు మౌన పాదయాత్ర చేస్తాం’ అని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని యూనియన్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో తీర్మానం చేసినట్లు ఛైర్మన్‌ కె.రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఆర్టీసీ కార్మికుల వేతనాలు త్వరలో పెంచుతామని సీఎం 2019లో అసెంబ్లీలో ప్రకటించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సందర్భంగా 2020లోనూ హామీ ఇచ్చారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నెల రోజులవుతున్నా ఇంతవరకు వేతన సవరణను అమలు చేయలేదు’ అని పేర్కొన్నారు. సమావేశంలో కత్తుల యాదయ్య, ఎమ్వీ చారి, కొవ్వూరు యాదయ్య, ఎమ్డీ మోసిన్‌, కంది రవీందర్‌రెడ్డి, కె.దశరథ, ఐ.ఆంజనేయులు, డి.విద్యాసాగర్‌రెడ్డి, ఎం.ముత్యాలు, ఎస్‌జేఎం రెడ్డి పాల్గొన్నారు.

గత ఆరేళ్లుగా ప్రభుత్వం వేతన సవరణకు అనుమతి ఇవ్వకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆర్టీసీ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని