Khammam: భారమని వదిలేసి.. పేగుబంధం కదిలించి..

మూడో సంతానం కూడా అమ్మాయి కావడంతో దంపతులిద్దరూ భారమని భావించారు. శిశువును సర్కారు ఆసుపత్రి ‘ఊయల’లో వదిలేసి ఇంటికెళ్లిపోయారు.

Updated : 01 Jan 2023 09:02 IST

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: మూడో సంతానం కూడా అమ్మాయి కావడంతో దంపతులిద్దరూ భారమని భావించారు. శిశువును సర్కారు ఆసుపత్రి ‘ఊయల’లో వదిలేసి ఇంటికెళ్లిపోయారు. కానీ పేగు బంధాన్ని తెంచుకోలేక మనసు మార్చుకుని గంటల వ్యవధిలో ఆమె భర్తను ఆసుపత్రికి పంపింది. వివరాలు ఇలా ఉన్నాయి.

సూర్యాపేట జిల్లా మోతె మండలం గోపతండాకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ డిసెంబరు 23న భార్యను కాన్పు కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. అదేరోజు వైద్యులు సిజేరియన్‌ చేశారు. ఆడపిల్ల జన్మించడంతో వారు భారమని భావించారు. పుట్టిన శిశువు వద్దనుకునే తల్లిదండ్రుల కోసం ఆసుపత్రిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊయలలో బిడ్డను వదిలేసి శనివారం మధ్యాహ్నం ఇంటికెళ్లిపోయారు.  గంటల వ్యవధిలోనే తల్లి మనసు మారింది. భర్తను ఆసుపత్రికెళ్లి శిశువును తీసుకురమ్మని చెప్పింది. అతడు ఆసుపత్రికి వెళ్లి ఊయలలో వదిలివెళ్లిన పాప తమ బిడ్డే అని చెప్పాడు.

సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు నిజమని ప్రాథమిక అవగాహనకు వచ్చారు. ఈ ఘటనపై అప్పటికే ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ కేసు నమోదు చేయడంతో శిశువును అప్పగించేందుకు నిబంధనలు అడ్డొచ్చాయి. విచారణ అనంతరం తల్లిదండ్రులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని