రైల్వే పీసీఎస్సీ రాజారామ్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారం

దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ (పీసీఎస్సీ) రాజారామ్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారం దక్కింది.

Published : 26 Jan 2023 04:24 IST

ఈనాడు, దిల్లీ: దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ (పీసీఎస్సీ) రాజారామ్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారం దక్కింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం సైన్యం, పోలీసు, ఇతర శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి వివిధ పురస్కారాలను బుధవారం ప్రకటించింది. 1989 భారతీయ రైల్వే రక్షణ దళం సర్వీస్‌కు ఎంపికైన రాజరామ్‌ పలు రైల్వే జోన్లలో వివిధ హోదాల్లో సేవలందించారు. దామ్‌రా-భద్రక్‌ రైలుమార్గంలో రూ.20 కోట్ల విలువైన బొగ్గు చోరీని అడ్డుకోగలిగారు. అస్సాం దిమాపుర్‌లో రైల్వే అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ అపహరణకు గురైనప్పుడు కూంబింగ్‌ ఆపరేషన్‌కు నేతృత్వం వహించి ఆయనను విడిపించారు. రైల్వే రక్షణ వ్యవస్థలో ఆయన చేసిన కృషికి గాను 2012 ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌, 2006లో డీజీస్‌ ఇన్‌సిగ్నియా, జనరల్‌ మేనేజర్‌ పతకాలు 5, రక్షణ ప్రతిభా పురస్కారాలు 3, నాలుగు అభినందన పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారానికి ఎంపికైన రాజారామ్‌కు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అభినందనలు తెలిపారు. రైల్వే పోలీస్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఏడో బెటాలియన్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ దేవరాయి శ్రీనివాసరావు, ఆగ్నేయ మధ్య రైల్వేలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ఎన్‌.శ్రీనివాసరావు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని