TSLPRB: ‘ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి అభ్యర్థులకు’ మరోసారి ఎత్తు కొలతలు

ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి నియామక పరీక్షల్లో.. నిర్దేశిత ఎత్తు కంటే సెంటీమీటర్‌, ఆలోపు తక్కువ ఎత్తు కారణంగా అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మరో అవకాశం కల్పించింది.

Updated : 09 Feb 2023 09:25 IST

ఒక్క సెం.మీ. తేడాతో అనర్హులైన వారికి అవకాశం  
10 నుంచి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి నియామక పరీక్షల్లో.. నిర్దేశిత ఎత్తు కంటే సెంటీమీటర్‌, ఆలోపు తక్కువ ఎత్తు కారణంగా అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మరో అవకాశం కల్పించింది. ఇలా అనుత్తీర్ణులైన కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాంటి వారి ఎత్తును మరోసారి పరీక్షించాలని కోర్టు ఆదేశించడంతో మండలి ఈ నిర్ణయం తీసుకొంది. ఒక్క సెం.మీ. లేదా అంతకన్నా తక్కువ ఎత్తులో అనుత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని మండలి తెలిపింది. www.tslprb.in వెబ్‌సైట్‌లో ఈ నెల 10న ఉదయం 8 గంటల నుంచి 12న రాత్రి 8 గంటల్లోపు వ్యక్తిగత లాగిన్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాస్‌రావు బుధవారం సూచించారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌, కొండాపూర్‌లోని 8వ బెటాలియన్‌ మైదానాల్లో వీరికి ఎత్తు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. దరఖాస్తు పత్రాన్ని పరీక్ష సమయంలో వెంట తెచ్చుకోవాల్సి ఉంటుందని మండలి ఛైర్మన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని