మాగనూరు- కృష్ణా రైలు మార్గం సిద్ధం

మహబూబ్‌నగర్‌ - మునీరాబాద్‌ కొత్త రైల్వే ప్రాజెక్టులో మాగనూరు- కృష్ణా మధ్య 12.7 కి.మీ. మేర కొత్త రైలు మార్గం నిర్మాణం పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది.

Published : 09 Feb 2023 03:56 IST

మహబూబ్‌నగర్‌-మునీరాబాద్‌ ప్రాజెక్టులో రాష్ట్ర సరిహద్దు వరకు నిర్మాణం పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ - మునీరాబాద్‌ కొత్త రైల్వే ప్రాజెక్టులో మాగనూరు- కృష్ణా మధ్య 12.7 కి.మీ. మేర కొత్త రైలు మార్గం నిర్మాణం పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది. మొత్తం రూ.3,543 కోట్ల అంచనా వ్యయంతో మహబూబ్‌నగర్‌-మునీరాబాద్‌ కొత్త లైను మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణలో మహబూబ్‌నగర్‌- కర్నూలు మార్గంలోని దేవరకద్ర నుంచి కొత్త లైను నిర్మాణం చేపట్టారు. దేవరకద్ర నుంచి కృష్ణా స్టేషన్‌ (నారాయణపేట జిల్లా) వరకూ 66 కి.మీ. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఉంది. ఇందులో దేవరకద్ర-జక్లేర్‌ 28.3 కి.మీ. సెక్షన్‌ 2017 మార్చిలో, జక్లేర్‌-మక్తల్‌ 11.5 కి.మీ. సెక్షన్‌ 2020 ఆగస్టులో, మక్తల్‌-మాగనూరు 13.3 కి.మీ. 2022 మార్చిలో పూర్తయ్యాయి. చివరి భాగం మాగనూరు-కృష్ణా తాజాగా పూర్తయిందని ద.మ.రైల్వే వివరించింది. దేవరకద్ర నుంచి కృష్ణా వరకు లైను నిర్మాణం పూర్తి కావడంతో.. హైదరాబాద్‌ నుంచి పొరుగు రాష్ట్రాల్లోని రాయచూరు, గుంతకల్లు, బళ్లారి, హుబ్లీ, గోవా వంటి నగరాలకు రైళ్ల రాకపోకలకు ఇది అత్యంత అనుకూల మార్గం కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని