వ్యవసాయానికి రూ.4.50 లక్షల కోట్ల ఖర్చు

గడిచిన ఎనిమిదేళ్లలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.4.50 లక్షల కోట్లు వెచ్చించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Published : 25 Mar 2023 03:29 IST

అసోచామ్‌ సదస్సులో మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: గడిచిన ఎనిమిదేళ్లలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.4.50 లక్షల కోట్లు వెచ్చించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్నదాతలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో భారతీయ పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల అనుబంధ సమాఖ్య (అసోచామ్‌) నిర్వహించిన ‘చిరుధాన్యాల సదస్సు-2023’కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘రైతు సంక్షేమాన్ని కేంద్రం విస్మరించింది. పంటలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్‌ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకురావడం లేదు. పల్లీలు, చిరుధాన్యాలు, చిక్కీల వంటి పదార్థాలు తయారుచేసి దేశంలోని విద్యార్థులకు అందించగలిగితే ఎంతో ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుంది. చిరుధాన్యాల సాగుకు తెలంగాణ ప్రాంతం అత్యంత అనుకూలం. వేరుశెనగ, జొన్న, సజ్జ, రాగి వంటి పంటల ఉప ఉత్పత్తులను మార్కెటింగ్‌ పెంచాలి. అందుకు ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, సమన్వయంతో పనిచేయాలి’’ అని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సదస్సులో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జయేశ్‌రంజన్‌, ఎస్‌బీఐ సీజీఎం అమిత్‌ జింగ్రాన్‌, అసోచామ్‌ తెలంగాణ కౌన్సిల్‌ చైర్మన్‌ కె.రవికుమార్‌రెడ్డి, న్యూట్రిహబ్‌ సీఈఓ దయాకర్‌రావు, ఐపీపీ సీఈఓ రంగయ్య, అసోచామ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ మచ్చ దినేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

* కోహెడ మార్కెట్‌ మొదటి దశను 9 నెలల్లో పూర్తి చేస్తామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తన నివాసంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి తదిరులతో సమావేశమై మార్కెట్‌ నిర్మాణ పనులను సమీక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని