ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు అభ్యంతరం

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుపై అభ్యంతరాలు తెలుపుతూ స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

Published : 01 Apr 2023 04:02 IST

స్థలం చదునుకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ భూమిపూజ
అనంతరం స్థానికుల ఆందోళన.. ఉద్రిక్తత

వెల్గటూరు, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుపై అభ్యంతరాలు తెలుపుతూ స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. స్తంభంపల్లి వద్ద 110 ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్లతో క్రిభ్‌కో సంస్థ ఆధ్వర్యంలో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతం చదునుకు రూ.13 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈపనులకు శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కంపెనీ ప్రతినిధులతో కలిసి భూమిపూజ నిర్వహించి వెళ్లారు. అయితే, ఈ స్థలంలో మొదట నిర్ణయించిన ప్రకారం గురుకుల పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆస్పత్రి, గోదాముల నిర్మాణాలు చేపట్టకుండా ఇథనాల్‌ పరిశ్రమ ఎలా స్థాపిస్తారంటూ స్తంభంపల్లి, పాశిగామ గ్రామాల ప్రజలు శుక్రవారం మధ్యాహ్నం వరంగల్‌-రాయపట్నం రాష్ట్ర రహదారిపై ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మద్దతుగా నిలిచారు. లక్ష్మణ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి వాహనంలో తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా.. మహిళలు ఆయన చుట్టూ చేరి నిలువరించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్‌, ఓ మహిళ చేతిపై గాయాలయ్యాయి. లక్ష్మణ్‌కుమార్‌ను సారంగాపూర్‌ స్టేషన్‌కు, కాంగ్రెస్‌ కార్యకర్తలను గొల్లపల్లి ఠాణాకు తరలించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు