Biryani - Swiggy: బిర్యానీకే జై!

అందుబాటులో ఎన్ని రుచులున్నా ఆహా అనిపించేది బిర్యానీయే అంటారు ఆహారప్రియులు. సాధారణంగా రంజాన్‌ మాసంలో హలీంను ఎక్కువ మంది ఆస్వాదిస్తుంటారు.

Updated : 22 Apr 2023 11:35 IST

రంజాన్‌ నెలలోనూ 10 లక్షల ఆర్డర్లు
హలీంను కోరింది 4 లక్షల మంది

ఈనాడు, హైదరాబాద్‌: అందుబాటులో ఎన్ని రుచులున్నా ఆహా అనిపించేది బిర్యానీయే అంటారు ఆహారప్రియులు. సాధారణంగా రంజాన్‌ మాసంలో హలీంను ఎక్కువ మంది ఆస్వాదిస్తుంటారు. ఈ రుచుల కోసం జిల్లాలు, ఇతర నగరాల నుంచి హైదరాబాద్‌కు వస్తుంటారు. ఈ నేపథ్యంలో రంజాన్‌ సీజన్‌లో బిర్యానీ విక్రయాలు తగ్గుతుంటాయి. ఆ ఆనవాయితీని ఈ దఫా పటాపంచలు చేశారు భాగ్యనగర వాసులు. పండగ ఏదైనా, ఏ కాలంలోనైనా బిర్యానీకే జైకొడతామని నిరూపించారు. స్విగ్గీ సంస్థకు రంజాన్‌ నెలలో వచ్చిన ఆర్డర్లే అందుకు నిదర్శనం. ‘ఈ నెలలో సుమారు 10 లక్షల బిర్యానీలను నగరవాసులు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చారు. గత ఏడాది కంటే ఇది 20 శాతం అధికం’ అని ఆ సంస్థ తాజాగా వెల్లడించింది. హలీంకు నెల రోజుల్లో 4 లక్షల ఆర్డర్లు వచ్చినట్టు పేర్కొంది.

గతంలో హలీంలో ఒకట్రెండు రుచులు మాత్రమే ఉండేవి. ఈ సీజన్‌లో మటన్‌, చికెన్‌, ఫిష్‌తోపాటు పర్షియన్‌ స్పెషల్‌, పాలమూరు పొట్టేలు, డ్రైఫూట్‌ తదితర తొమ్మిది రకాలను చెఫ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారని, వచ్చిన ఆర్డర్లను బట్టిచూస్తే అన్ని రకాల రుచులను నగర వాసులు ఇష్టపడుతున్నట్టు తేలిందని ఆ సంస్థ పేర్కొంది. శుక్రవారంతో రంజాన్‌ నెల ముగుస్తుండటంతో ఆఖరి రోజు హలీం కేంద్రాల ముందు ఆహారప్రియులు బారులుదీరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని