Southwest Monsoon: నైరుతి దాగుడుమూతలు!

వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడింది. అవి సముద్రంపైనే నిలకడగా ఉంటూ..దాగుడుమూతలు ఆడుతున్నాయి.

Updated : 06 Jun 2023 09:39 IST

అండమాన్‌ సమీపంలోనే ఆగిన రుతుపవనాలు
మరో మూడు రోజుల తరవాతే కేరళ తీరానికి
15 నాటికి తెలంగాణకు..
ఎల్‌నినో ప్రభావంతోనే అంటున్న వాతావరణ శాఖ
తొలకరి జాడలేక ఆరంభంకాని వ్యవసాయ పనులు

ఈనాడు, హైదరాబాద్‌: వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడింది. అవి సముద్రంపైనే నిలకడగా ఉంటూ..దాగుడుమూతలు ఆడుతున్నాయి. ఈ కారణంగా మరో మూడు రోజుల తర్వాతే అవి కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని అంచనా. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 15 దాకా వర్షాలు పడకపోవచ్చని వాతావరణశాఖ అంచనాకు వచ్చింది. ప్రస్తుతం అండమాన్‌ దీవులను దాటి బంగాళాఖాతంలో కొంత ముందుకు వచ్చిన రుతుపవనాలు అక్కడే ఆగాయి. ఇటు అరేబియా సముద్రంలో లక్షదీవులను తాకినవీ ముందుకు కదలలేదు. గతేడాది జూన్‌ ఒకటిన కేరళను తాకగా ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాటి ఆలస్యంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వానాకాలంలో వర్షపాతం అయిదు శాతం వరకూ తగ్గవచ్చని అంచనా. రుతుపవనాల మందగమనానికి ఎల్‌నినో ప్రభావం కొంత కారణం కావొచ్చని వాతావరణ శాస్త్రవేత్తల అంచనా. ‘పసిఫిక్‌ మహా సముద్రంలోని పెరు, ఈక్వెడార్‌ల వద్ద సముద్ర జలాలు సాధారణంకన్నా ఏడు డిగ్రీలు అదనంగా వేడెక్కి గాలుల్లో ఒత్తిడి అధికమైంది. ఆ ప్రభావం భారతదేశం చుట్టుపక్కల సముద్ర జలాలపైనా పడుతోంది. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటే కరవు ఏర్పడుతుంది. ఉదాహరణకు దీని ప్రభావంతో ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్‌, భారత్‌ వంటి దేశాల్లో 1997-98, 2003, 2015 సంవత్సరాల్లో వర్షాలులేక కరవు పరిస్థితులు ఏర్పడి రైతులు నష్టపోయారు. అదే సమయంలో కుంభవృష్టి కురిసి పెరూ, అమెరికా వంటి దేశాల్లో వరదలు వచ్చాయి. ప్రతి రెండు నుంచి ఏడు సంవత్సరాలకోసారి ఎల్‌నినో ప్రభావం పడటం ఆనవాయితీగా మారింది’’ అని నిపుణులు పేర్కొంటున్నారు.

ఎండలే..ఎండలు

గత మూడేళ్లుగా భారత దేశంలోకి రుతుపవనాలు నిర్ణీత తేదీల్లో జూన్‌ మొదటి వారంలోనే దేశంలోకి ప్రవేశించాయి. ఈ దఫా ఆలస్యమయ్యాయి. సాధారణంగా జూన్‌ మొదటివారంలో రుతుపవనాల విస్తరణతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవాలి. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో మండుటెండలు ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఇలా జూన్‌ మొదటి వారం చివరిలో వడగాలులు వీయడం తెలంగాణలో అత్యంత అరుదు. ఎండ వేడికి అన్నదాతలు దుక్కి దున్నే సాహసం చేయలేకున్నారు. ఏరువాక పౌర్ణమి ఈ నెల 4నే దాటినా విత్తనాలు వేయలేనంతగా ఎండలున్నాయంటే వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయంపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. ‘ప్రస్తుతం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురుస్తున్నాయి. అవి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్నవి కాదు. అవి కొనసాగవు. విత్తనాలు వేస్తే మొలకెత్తక ఎండిపోయే ప్రమాదముంది’ అని ఆయన హెచ్చరించారు. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ఆరంభమయ్యే వరకు రైతులు విత్తనాలు వేయవద్దని సూచించారు.


నాలుగు ఉమ్మడి జిల్లాలకు వడగాలుల ముప్పు

రాష్ట్రంలో ఈ నెల 9వతేదీ వరకు వడగాలులు వీస్తాయని పేర్కొంటూ వాతావరణశాఖ సోమవారం ప్రజలకు పసుపు రంగు హెచ్చరిక జారీచేసింది. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పగటిపూట 42 నుంచి 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌ దక్షిణ ప్రాంతంపై 1,500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉందని, ఛత్తీస్‌గఢ్‌ ఉత్తర ప్రాంతం నుంచి తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తున ఏర్పడిందని, వీటి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురిసే సూచనలున్నాయని ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని