TSRTC: ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

Updated : 01 Aug 2023 08:31 IST

43,373 మందికి ఇకపై సర్కారీ జీతాలు
రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు
వరద ప్రాంతాలకు రూ. 500 కోట్ల సాయం
40 మంది మృతుల కుటుంబాలకు పరిహారం
మరో ఎనిమిది కొత్త వైద్యకళాశాలలు
గవర్నర్‌ తిరస్కరించిన బిల్లులు మళ్లీ శాసనసభకు
హకీంపేట ఎయిర్‌పోర్టు పౌరసేవలకు వినియోగించే యోచన
అనాథల సంరక్షణకు ప్రత్యేక విధానం
మంత్రిమండలి నిర్ణయాలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం అమలులోకి వస్తే.. ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 43,373 మంది ఉద్యోగులు సర్కారీ ఉద్యోగులుగా మారతారు. వారికి ప్రభుత్వమే జీతభత్యాలు చెల్లించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు ప్రత్యేక కమిటీని నియమించింది. విలీన బిల్లును వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతామని మంత్రివర్గం వెల్లడించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సోమవారం సుమారు ఆరుగంటల పాటు జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌.. ఇతర మంత్రులతో కలిసి ఈ నిర్ణయాలను విలేకరులకు వెల్లడించారు. రాష్ట్రంలో వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల ప్రజలకు రూ. 500 కోట్ల తక్షణ సాయం విడుదల చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. వరదల్లో మరణించిన 40 మంది కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు అనుమతించింది. పంటనష్టాలపై సమగ్ర నివేదికలు అందించాలని, రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై తిరస్కరించిన మూడు బిల్లులను మరోసారి శాసనసభలో ఆమోదించి, గవర్నర్‌కు పంపాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మరో ఎనిమిది కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. వీటితో మొత్తం 33 జిల్లాల్లోనూ వైద్యకళాశాలలు సమకూరతాయని పేర్కొంది. హకీంపేట విమానాశ్రయాన్ని పౌరవిమానయాన సేవలకు వినియోగించుకునేందుకు కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది.

ఆర్టీసీ బలోపేతానికి..

ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజారవాణా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు, సేవలను ఇంకా విస్తృతపరిచేందుకు సంస్థలో పనిచేస్తున్న వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులు గతంలో సమ్మె చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ సానుకూల నిర్ణయం వెలువరించింది. దీనిపై విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆర్‌అండ్‌ బీ, రవాణాశాఖ, జీఏడీ శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి నివేదికను వెంటనే సిద్ధం చేసి.. ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించింది. దీనిపై శాసనసభ వర్షాకాల సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ ప్రారంభించాలని రవాణాశాఖ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

వరద నష్టాలపై విస్తృత చర్చ..

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నష్టాలపై మంత్రిమండలి విస్తృతంగా చర్చించింది. ఈ నెల 18 నుంచి 28 వరకు పెద్ద ఎత్తున కురిసిన వర్షాలు, వరదలతో వరంగల్‌, ములుగు, భూపాలపల్లి, హనుమకొండ, జనగామ, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, కొత్తగూడెంతో పాటు పది జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రజలకు, వివిధ వర్గాలకు నష్టం జరిగిందని, పంటలు, రోడ్లు, చెరువులు, కాలువలు ధ్వంసమయ్యాయని అధికారులు నివేదించారు. దీనిపై సీఎం స్పందించి తక్షణ సహాయం కింద రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. అవసరమైనచోట యుద్ధప్రాతికదికన తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు నిధులు కేటాయించామని తెలిపారు. మరణించిన 40 మంది వివరాలను సేకరించి.. వారి కుటుంబాలకు పరిహారమివ్వాలని నిర్దేశించారు. ‘వర్షాల వల్ల చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి. పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. కొన్నిచోట్ల ఇతర సమస్యలు వచ్చాయి. కలెక్టర్లు వాటిని పరిశీలించి వెంటనే సమగ్ర నివేదికలు ఇవ్వాలి. వరదలతో తెగిన రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేయాలి. ఖమ్మం పట్టణం నుంచి మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు ఖమ్మం పొడవునా ఉన్న నది వెంట ఆర్‌సీసీ గోడతో కూడిన కరకట్టను నిర్మించాలి. దీనికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నాం. దీనికి సంబంధించి నివేదిక తయారు చేయాలి’ అని సీఎం ఆదేశించారు.


విద్యుత్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుడికి ఆగస్టు 15న సన్మానం

రదల సమయంలో ఆపద్బాంధవులుగా నిలిచిన ఉద్యోగులను సీఎం ప్రత్యేకంగా మంత్రిమండలిలో ప్రస్తావించారు. ఇద్దరు విద్యుత్‌ ఉద్యోగులు వరదలను లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి విద్యుక్తధర్మాన్ని నెరవేర్చారని సీఎం అభినందించారు. ఆగస్టు 15న ఇద్దరిని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్కరిస్తామని సీఎం ప్రకటించారు. ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న మీనయ్య అనే ఉపాధ్యాయుడు 40 మంది పిల్లలను కాపాడారని.. ఆయనను కూడా సన్మానిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని