TS High Court: రిజిస్ట్రేషన్‌ రద్దు కాకుండా కొంటే హక్కులు పొందలేరు: హైకోర్టు

ఒక ఆస్తికి సంబంధించి మొదటి రిజిస్ట్రేషన్‌ రద్దు కాకుండా తరువాత కొనుగోలు చేసినవారు హక్కులను పొందలేరని హైకోర్టు పేర్కొంది.

Updated : 24 Mar 2024 09:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఒక ఆస్తికి సంబంధించి మొదటి రిజిస్ట్రేషన్‌ రద్దు కాకుండా తరువాత కొనుగోలు చేసినవారు హక్కులను పొందలేరని హైకోర్టు పేర్కొంది. తరువాత చేసిన రిజిస్ట్రేషన్‌లు చెల్లవని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఓ కేసులో జస్టిస్‌ నగేష్‌ భీమపాక ఇటీవల ఈ మేరకు తీర్పు వెలువరించారు. వివరాలివీ.. వట్టినాగులపల్లిలో 460 ఎకరాల్లో శంకర్‌హిల్స్‌ లేఅవుట్‌ ఉంది. అందులో 500 చదరపు గజాలను గోపు నాగమణి తండ్రి 1983లో కొనుగోలు చేశారు. పంచాయతీ అనుమతితో వేసిన లేఅవుట్‌లో 1986 దాకా 3,328 ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ జరిగింది. వారంతా కలిసి 1989లో శంకర్‌హిల్స్‌ ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. గత ఏడాది ఆ ప్లాట్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ కోసం నాగమణి దరఖాస్తు చేశారు. ఆ 460 ఎకరాల్లో కొంత భూమిపై తమకు హక్కులున్నాయని జైహింద్‌రెడ్డి తదితరులు పేర్కొంటూ ఆమెకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వరాదని, ఆ స్థలం జీవో 111లో ఉందని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు విద్యుత్‌ అధికారులు ఆమెకు కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే పిటిషన్‌లో జైహింద్‌రెడ్డి తదితరులు తమను ప్రతివాదులుగా చేర్చుకోవాలంటూ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రికార్డులన్నింటినీ పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్‌ నగేష్‌ భీమపాక అధికారుల తీరును తప్పుబట్టారు. ‘‘నాగమణి తండ్రి 500 చదరపు గజాలను 15 మంది నుంచి కొనుగోలు చేశారు. ఆయన మాదిరే 3 వేలమందికి పైగా కొన్నారు. ఆ విషయాన్ని తొక్కిపెట్టి.. 1997లో 33 ఎకరాలను ఆ 15 మందిలో 13 మంది తమకు విక్రయించారని జైహింద్‌రెడ్డి చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ బలవంతులైన వాళ్లు ఆ భూమిపై కన్నేసి తమ బలం, తెలివితేటలను ప్రదర్శించారు. అంతా తెలిసే... ఎప్పుడో విక్రయించిన స్థలాన్ని ఉద్దేశపూర్వకంగా 13 మంది నుంచి జైహింద్‌రెడ్డి తదితరులు కొన్నారు. అందువల్ల జైహింద్‌రెడ్డి తదితరులను ప్రతివాదులుగా ఆమోదించలేం’’ అంటూ వారి పిటిషన్‌ను కొట్టేశారు. వారు రూ.1,000 చొప్పున హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీకి చెల్లించాలన్నారు. పిటిషనర్‌కు తక్షణం కరెంట్‌ కనెక్షన్‌ ఇవ్వాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించారు.


  • మహాభారతంలో... పాండవులకు అయిదూళ్లు ఇవ్వాలని శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని అడగ్గా.. ‘వాటిని ఇప్పటికే సామంతరాజులకు ఇచ్చేశాను. నాకు చెందనివి, ఇతరులకు ఇచ్చినవాటిని పాండవులకు ఎలా ఇవ్వగలను’ అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రకారం ఆస్తిపై హక్కులు కోల్పోయిన వారు ఇతరులకు హక్కులను ఇవ్వలేరు.
  • భూమి విలువ ఎప్పుడూ పెరుగుతుందని భావించి ప్రజలు స్థలాలు కొనుక్కుంటూ ఉంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వాళ్లు చెమటోడ్చి సంపాదించిన సొమ్మును భవిష్యత్తు అవసరాలైన పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఆరోగ్యం కోసం భూములపై పెట్టుబడి పెడతారు. అలాంటి భూములపై బలవంతులైన వాళ్లు కన్నేసి.. కుట్ర చేస్తామంటే కుదరదు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నగేష్‌ భీమపాక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని