అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం

అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు.

Published : 10 May 2024 04:16 IST

నయీంనగర్‌ (హనుమకొండ), వరంగల్‌ నగరం - న్యూస్‌టుడే: అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. హనుమకొండ నయీంనగర్‌కు చెందిన చింతకింది రూపేశ్‌చంద్ర (26) ఈ నెల 2వ తేదీ నుంచి అదృశ్యం కావడంతో అతని తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. చింతకింది సదానందం, ఉమా దంపతుల రెండో కుమారుడైన రూపేశ్‌చంద్ర హనుమకొండలో బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. 2019లో లండన్‌ వెళ్లి ఎంఎస్‌ పూర్తిచేశాడు. తిరిగి 2022లో హనుమకొండ వచ్చాడు. గత ఏడాది డిసెంబరులో డబుల్‌ ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్లిన రూపేశ్‌చంద్ర విస్కాన్సిన్‌లోని కాంకార్డియా యూనివర్సిటీలో చదువుతున్నాడు.

షికాగోలోని షెరిడాన్‌ రోడ్డులో ఉంటున్నాడు. తల్లిదండ్రులతో నిత్యం ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. ఈ నెల రెండో తేదీన చివరిసారిగా కుమారుడితో మాట్లాడినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఆ తర్వాత ఫోన్‌ చేయగా అందుబాటులోకి రాలేదని కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుమారుడితోపాటు ఉండే యువకుడితో మాట్లాడగా రెండు రోజులు బయట పని ఉందని చెప్పి వెళ్లినట్లు చెప్పాడని తెలిపారు. తమ కుమారుడి ఆచూకీ కోసం అమెరికాలో తానా సహాయంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రూపేశ్‌చంద్ర అదృశ్యంపై కలెక్టర్‌, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించుకున్నట్లు చెప్పారు. తప్పిపోయిన తమ కుమారుడి ఆచూకీని త్వరితగతిన తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, నాయకులు, అధికారులను తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వారం రోజులుగా ఆ కుటుంబ సభ్యులు నిద్రాహారాలు మానేసి అతని ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. విద్యార్థి తండ్రి సదానందం ద్విచక్ర వాహనాల మెకానిక్‌ కాగా తల్లి గృహిణి. వారి పెద్ద కుమారుడు అరుణ్‌కుమార్‌ తండ్రికి సహాయకుడిగా మెకానిక్‌ పని చేస్తున్నాడు. కాగా షెరిడాన్‌ రోడ్డు ప్రాంతంలోనే రూపేశ్‌చంద్ర అదృశ్యమైనట్లు షికాగో పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. అతని ఆచూకీ ఎవరికి తెలిసినా సమాచారం అందించాలని ప్రజలను కోరారు. విద్యార్థి ఆచూకీ కనుగొనేందుకు స్థానిక పోలీసులతోనూ, భారత సంతతి వ్యక్తులతోనూ నిరంతరం సంప్రదిస్తున్నట్లు షికాగోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని