Updated : 12 Nov 2021 05:03 IST

Raja Chari: రోదసిలోకి మన రాజాచారి!

భూ కక్ష్యలోకి తెలుగు వ్యోమగామి
నేడు ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశం

కేప్‌ కెనావెరాల్‌: తెలుగు మూలాలున్న అమెరికా వ్యోమగామి రాజాచారి గురువారం విజయవంతంగా రోదసిలోకి చేరారు. మరో ముగ్గురితో కలిసి ఆయన ‘ఎండ్యూరెన్స్‌’ వ్యోమనౌక ద్వారా ఈ ఘనత సాధించారు. వీరు 6 నెలల పాటు భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో విధులు నిర్వర్తిస్తారు. చారికి ఇది తొలి రోదసి యాత్ర. అయినా ఈ బృందానికి ఆయనే కమాండర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం.

స్పేస్‌ఎక్స్‌ రూపొందించిన ఎండ్యూరెన్స్‌ వ్యోమనౌక గురువారం ఉదయం కేప్‌ కెనావెరాల్‌లోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్‌ రాకెట్‌ ద్వారా  నింగిలోకి దూసుకెళ్లింది. ఈ యాత్రలో పాల్గొన్న మథియాస్‌ మౌరర్‌ (జర్మనీ) అనే వ్యోమగామి.. రోదసిలోకి వెళ్లిన 600వ వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది అంతరిక్ష పర్యాటకులు పెరగడంతో ఈ సంఖ్యకు చేరుకోవడానికి వీలైంది. 1961లో రష్యాకు చెందిన యూరి గగారిన్‌ యాత్రతో మానవుల రోదసియానం మొదలైన సంగతి తెలిసిందే.  
భూకక్ష్యలోకి చేరిన వెంటనే.. ‘‘ఇది అద్భుతమైన యాత్ర. మేం ఊహించినదాని కన్నా బాగుంది’’ అని రాజాచారి వ్యాఖ్యానించారు. వీరి వ్యోమనౌక శుక్రవారం ఉదయం ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమవుతుంది. ఆ తర్వాత వారు ఆ కేంద్రంలోకి అడుగుపెడతారు. ఐఎస్‌ఎస్‌లో దాదాపు 200 రోజుల పాటు విధులు నిర్వర్తించిన నలుగురు వ్యోమగాములు రెండు రోజుల కిందట భూమికి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి రాజాచారి బృందం రోదసిలోకి వెళ్లాకే వారు తిరుగు ప్రయాణం కావాల్సింది. అయితే ఎండ్యూరెన్స్‌ ప్రయోగం పదేపదే వాయిదాపడటంతో పాత వ్యోమగాములను ముందే భూమికి రప్పించాలని అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ నిర్ణయించింది.


ఎవరీ చారి?

భారతీయ అమెరికన్‌ అయిన రాజాచారి అమెరికా వాయుసేనలో కర్నల్‌ హోదాలో పనిచేశారు. ఆయన తండ్రి శ్రీనివాస్‌ చారి. రాజాచారి తాత స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా. ఆయన హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. అదే వర్సిటీ నుంచి శ్రీనివాస్‌ చారి ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ పెగ్గీ ఎగ్బర్ట్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి 1977 జూన్‌ 24న రాజాచారి జన్మించారు. ఆయన  మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్‌, ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. అమెరికా నౌకాదళ టెస్ట్‌ పైలట్‌ స్కూల్‌లో తర్ఫీదు పొందారు. 2017లో నాసాలో వ్యోమగామిగా ఎంపికయ్యారు.  తాను ఇప్పటివరకూ మూడుసార్లు హైదరాబాద్‌ వచ్చానని రాజాచారి ఒక సందర్భంలో చెప్పారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని