Updated : 07 Jan 2022 04:52 IST

Covid Third Wave: కొవిడ్‌ మూడోదశ మొదలైంది

వచ్చే 4 వారాల్లో గరిష్ఠ స్థాయికి కేసులు  
ఒమిక్రాన్‌ సామాజిక వ్యాప్తి
ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతి ప్రారంభమైందని ప్రజారోగ్య సంచాలకుడు(డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. వారం రోజుల్లోనే నాలుగు రెట్లకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయని.. పాజిటివిటీ రేటు 1 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగిందని చెప్పారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సామాజిక వ్యాప్తి జరుగుతోందన్నారు. వచ్చే 4 వారాల్లో కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయన్నారు.ఫిబ్రవరి రెండో వారం ముగిసే సరికి క్రమేణా తగ్గిపోవచ్చని ఆయన విశ్లేషించారు. కాబట్టి వచ్చే నాలుగు వారాలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని హెచ్చరించారు. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడో దశలో మరణాల శాతం దాదాపుగా సున్నానేననీ.. ప్రాణాలు పోయే ముప్పు లేదని ప్రజలు గ్రహించాలని తెలిపారు. అయితే, ఇప్పటికీ డెల్టా వేరియంట్‌ కేసులు 40 శాతం వరకూ నమోదవుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో పండగలు, వేడుకలను కుటుంబసభ్యుల మధ్య మాత్రమే జరుపుకోవాలని సూచించారు. వచ్చే నాలుగు వారాలు అన్ని రకాల కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజాసంఘాలను డీహెచ్‌ కోరారు.

‘‘ప్రస్తుతం నమోదవుతున్న వాటిలో 60-70 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులే. బాధితుల్లో 95 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. లక్షణాలున్నవారిలోనూ కొద్దిపాటి జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు, తలనొప్పి, నిస్సత్తువ వంటివి కనిపిస్తున్నాయి. అయిదు రోజుల్లోనే కోలుకుంటున్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకపోవడం సానుకూల అంశం. అయినా సరే మూడు రోజుల తర్వాత కూడా లక్షణాల తీవ్రత పెరుగుతుంటే మాత్రం ఆసుపత్రిలో చేరిపోవాలి. రక్తంలో ఆక్సిజన్‌ శాతం 93 కంటే తక్కువగా ఉన్నా ఆసుపత్రిలో చేరాలి. ఎటువంటి వ్యాధి లక్షణాలు లేనివారు, సాధారణ లక్షణాలున్నవారూ భయంతో ఆసుపత్రిలో చేరుతున్నారు. దీంతో నిజంగా అవసరమైన వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రైవేటు ఆసుపత్రులు రోగులను అనవసరంగా చేర్చుకోవద్దు. అవసరం లేకపోయినా ఖరీదైన మందులను వాడొద్దు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం.

ఒక్క శాతం మంది ఆసుపత్రిలో చేరినా భారమే
రాబోయే రోజుల్లో మొత్తం కేసుల్లో ఒక్క శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడినా.. వాటిపై భారం పడే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ముందు నుంచే అప్రమత్తతతో మెలగాలి. రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌ ఉండదు.. కానీ, కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. వ్యాక్సిన్‌ తీసుకోని వారు దయచేసి వెంటనే తీసుకోవాలి. వైరస్‌ సోకినా.. టీకా తీసుకున్నవారికి తీవ్రస్థాయి దుష్ప్రభావం ఎదురవకుండా ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో వైద్యబృందాలను నియమించి పరీక్షలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎన్ని వేల కేసులొచ్చినా తట్టుకునే సామర్థ్యముంది. రాష్ట్రంలో ఎక్కడా ఆసుపత్రులలో చేరికలు పెరగలేదు. ఒమిక్రాన్‌తో ఎవరూ చనిపోలేదు. ప్రజలు ఆందోళనకు గురికావొద్దు. వచ్చే 4 వారాల పాటు వైద్యసిబ్బంది సెలవులు తీసుకోవద్దు’’ అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.


తప్పనిసరిగా పాటించాల్సినవి..

* ఇంటా బయటా మాస్కు ధరించాలి, గుంపుల్లోకి వెళ్లొద్దు

* గదుల్లో గాలి, వెలుతురు బాగా ఆడేట్టు చూసుకోవాలి

* వ్యక్తిగత దూరాన్ని పాటించాలి, టీకాలు తీసుకోవాలి

* వ్యాధి లక్షణాలున్న వారు సమీప వైద్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలి

* పాజిటివ్‌గా తేలితే అర్హుడైన వైద్యుడి సూచనల మేరకు చికిత్స పొందాలి


 


Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts