Pakistan: పాక్‌లో బిక్కుబిక్కుమంటోన్న చైనీయులు..!

సీపెక్‌ ప్రాజెక్టు, ఇతర పనుల నిమిత్తం పాకిస్థాన్‌లో జీవిస్తున్న చైనీయుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. వారు ఎక్కడికి వెళ్లినా

Published : 18 Jun 2022 02:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సీపెక్‌ ప్రాజెక్టు, ఇతర పనుల నిమిత్తం పాకిస్థాన్‌లో నివసిస్తోన్న చైనీయుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. వారు ఎక్కడికి వెళ్లినా ముందుగా భద్రతా సిబ్బందికి చెప్పాలని పాక్‌ ప్రభుత్వం కోరింది. విదేశీయులకు రక్షణగా ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘డిస్ట్రిక్ట్‌ ఫారెన్‌ సెక్యూరిటీ సెల్‌’ రివ్యూ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇటీవల కాలంలో చైనీయులపై దాడులు పెరిగిన విషయం తెలిసిందే. ‘డిస్ట్రిక్ట్‌ ఫారెన్‌ సెక్యూరిటీ సెల్‌’ విభాగం ఇప్పటికే ఇస్లామాబాద్‌లో ఉంటోన్న చైనీయుల వివరాలను తెలుసుకొంది.

ఇస్లామాబాద్‌లో దాదాపు 1,000 మంది చైనీయులు.. దాదాపు 36 వేర్వేరు ప్రాజెక్టులు, కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరికి రక్షణ కల్పించే అంశంపై ఆయా స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు నిర్ణయం తీసుకొంటారు. అవసరమైతే వీరికి రక్షణగా పెట్రోలింగ్‌ యూనిట్లు కూడా వెళతాయి. దీంతోపాటు చైనీయుల ప్రయాణ వివరాలు కూడా ఎస్‌హెచ్‌వోలు సేకరిస్తారు. చైనీయులు నివసించే ఇళ్ల వద్ద, ఆయా రహదారులపై కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. 

కరాచీ యూనివర్సిటీలో స్థానిక విద్యార్థులకు చైనీస్‌ భాషను బోధించే కన్ఫూసియస్‌ ఇన్‌స్టిట్యూట్‌ వద్ద ఇటీవల ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. బుర్ఖా ధరించిన ఓ మహిళ తనను తాను పేల్చుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చైనీస్‌ టీచర్లు, పాక్‌కు చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని