Long Covid: 30శాతం మంది బాధితుల్లో ‘లాంగ్‌కొవిడ్‌’ లక్షణాలు..!

కరోనా వైరస్‌ సోకిన బాధితుల్లో 30శాతం మందిలో దీర్ఘకాలిక కొవిడ్‌ (Long Covid) వెంటాడుతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది.

Published : 20 Apr 2022 01:34 IST

అమెరికా అధ్యయనంలో వెల్లడి

లాస్‌ ఏంజెల్స్‌: కరోనా వైరస్‌ సోకిన బాధితుల్లో 30శాతం మందిలో దీర్ఘకాలిక కొవిడ్‌ (Long Covid) వెంటాడుతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. ఇన్‌ఫెక్షన్‌ బారినపడిన నుంచి నెలల తరబడి వారిని కొన్ని లక్షణాలు వేధిస్తున్నాయని తెలిపింది. కొవిడ్‌ సోకిన అనంతర ప్రభావాలపై అమెరికా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

కరోనా వైరస్‌ సోకి ఆస్పత్రి పాలైన వారితోపాటు మధుమేహం, అధిక బరువు ఉన్న వారిలో పోస్ట్‌ అక్యూట్‌ సీక్వెలే ఆఫ్‌ కొవిడ్‌ (PASC)గా పిలిచే ‘లాంగ్‌ కొవిడ్‌’ ఎక్కువగా కనిపిస్తున్నట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెల్స్‌ (UCLA) పరిశోధకులు వెల్లడించారు.  దీర్ఘకాల కొవిడ్‌పై 309 మంది బాధితులపై అధ్యయనం చేపట్టగా.. కొవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న వారిలో అధికశాతం అలసట (31శాతం), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (15శాతం) వంటి లక్షణాలతో బాధపడినట్లు గుర్తించారు. ఇక వాసన గుర్తించకపోయే లక్షణం 16శాతం మందిలో కనిపించిందన్నారు.

కొవిడ్‌ తదనంతర ప్రభావాలను తెలుసుకోవడంలో భాగంగా అమెరికా పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో మొత్తం 1038 మంది కొవిడ్‌ బాధితులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 309 మందిలో లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. కొందరిలో కొన్ని లక్షణాలు దీర్ఘకాలంపాటు వేధిస్తున్నట్లు గుర్తించారు. అయితే, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిపై దీర్ఘకాలంలో కొవిడ్‌ ఎటువంటి ప్రభావం చూపిస్తుందన్న విషయాలను తెలుసుకోవడంలో తాజా అధ్యయనం దోహదపడుతుందని పరిశోధనలో కీలక పాత్ర పోషించిన యూసీఎల్‌ఏ ప్రొఫెసర్‌ సస్‌ యూ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని