Ukraine Crisis: పెట్రేగిపోతున్న రష్యా.. ల్వీవ్‌పై క్షిపణుల వర్షం.. పలువురి మృతి!

ఉక్రెయిన్‌లోని కీవ్‌, ల్వీవ్‌ వంటి ప్రధాన నగరాలు సహా పలు పట్టణాలపై రష్యా సైన్యం దాడులతో పెట్రేగిపోతోంది. ఈరోజు ఉదయాన్నే ల్వీవ్‌ నగరంపై......

Updated : 25 Apr 2022 12:09 IST

కీవ్‌: ఉక్రెయిన్‌లోని కీవ్‌, ల్వీవ్‌ వంటి ప్రధాన నగరాలు సహా పలు పట్టణాలపై రష్యా సైన్యం దాడులతో పెట్రేగిపోతోంది. ఈరోజు ఉదయాన్నే ల్వీవ్‌ నగరంపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడిలో ఆరుగురు మృతిచెందినట్టు ల్వీవ్‌ ప్రాంత గవర్నర్‌ మాక్స్యం కొజిత్స్కీ వెల్లడించారు. ఈ ఉదయాన్నే రష్యా నాలుగు క్షిపణులతో దాడి చేయగా.. వీటిలో మూడు మిలటరీ మౌలిక స్థావరాలపై పడగా.. ఒకటి మాత్రం కారు మరమ్మతు దుకాణంపై పడినట్టు తెలిపారు. మరోవైపు లుహాన్స్క్‌ ప్రాంతంలోనూ రష్యా బలగాలు ఒలింపిక్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ధ్వంసం చేశాయి. డొనెట్స్క్‌ ప్రాంతంలో గడిచిన 24గంటల వ్యవధిలోనే 9స్థావరాలపై రష్యా దాడులకు తెగబడగా..  ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. కనీసం తొమ్మిది మంది గాయపడినట్టు పేర్కొన్నారు. పలు నివాస భవనాలతో పాటు రైల్వే మౌలిక వసతులు, స్టేడియం ధ్వంసమైనట్టు అధికారులు తెలిపినట్టు ‘ది కీవ్‌ ఇండిపెండెంట్‌’ పేర్కొంది. 

20,600 మంది రష్యా సైనికుల్ని చంపాం: ఉక్రెయిన్‌ 

రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తున్నట్టు ఉక్రెయిన్‌ సైన్యం పేర్కొంది. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైనప్పట్నుంచి ఇప్పటిదాకా 20,600 మందికి పైగా రష్యా సైనికుల్ని మట్టుబెట్టినట్టు ప్రకటించుకుంది. అలాగే, 167 విమానాలతో పాటు 147 హెలికాప్టర్లు, 790 యుద్ధ ట్యాంకులు, 2,041 సాయుధ శకటాలు, ఎనిమిది నౌకలు, భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. 

మరో రెండు రోజులు మానవతా కారిడార్లు లేనట్టే!

రష్యా సైన్యం దాడులతో ఉక్రెయిన్‌లోని ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు మానవతా కారిడార్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే కొన్నిరోజులుగా ఈ ప్రక్రియకు ఆటంకం కలిగింది. అయితే, మరో రెండు రోజుల పాటు మానవతా కారిడార్లు ఏర్పాటు చేయలేమని ఉక్రెయిన్‌ తాజాగా ప్రకటించింది. పలు తరలింపు మార్గాల్లో కాల్పుల విరమణకు రష్యా సైన్యం అంగీకరించలేదని ఉక్రెయిన్‌ ఉప ప్రధాని ఇరనా వెరెస్చుక్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని