Google: ఇంటర్వ్యూ చేస్తుండగా.. హెచ్‌ఆర్‌కి లేఆఫ్‌..!

గూగుల్(Google) ప్రకటించిన భారీ లేఆఫ్‌లో పలువురు ఉద్యోగులు ఊహించని రీతిలో ఉద్యోగాన్ని కోల్పోయారు. తాజాగా ఓ వ్యక్తి వెల్లడించిన స్టోరీ కూడా ఈ తరహాలోనిదే.

Published : 28 Jan 2023 01:23 IST

వాషింగ్టన్‌: దిగ్గజ సంస్థ గూగుల్(Google) చేపట్టిన భారీ లేఆఫ్స్‌లో రోజుకో కొత్త స్టోరీ వెలుగులోకి వస్తోంది. తమ పనిలో నిమగ్నమై ఉండగానే ఉద్యోగం పోయినవాళ్లున్నారు. సంస్థ కోసం ఒకరిని ఇంటర్వ్యూ చేస్తోన్న సమయంలోనే హెచ్‌ఆర్‌ సిబ్బంది ఒకరు ఉద్యోగం కోల్పోయారని ఓ వార్త సంస్థ కథనం పేర్కొంది. రిక్రూట్‌మెంట్ విభాగంలో ఉన్నవారికి కూడా ఈ లేఆఫ్స్ గురించి తెలియకపోవడం గమనార్హం.

డాన్‌ లానిగాన్‌ ర్యాన్.. గూగుల్‌లో రిక్రూట్‌మెంట్ విభాగ ఉద్యోగి. ఫోన్‌లో ఆయన ఇంటర్వ్యూ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కాల్‌ కట్ అయింది. అలాగే సంస్థకు చెందిన ఒక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా వీలుకాలేదు. తనతో పాటు మరికొందరికి ఈ పరిస్థితి ఎదురైంది. ఇదొక సాంకేతిక లోపంగా మేనేజర్ భావించినట్లు ర్యాన్‌ చెప్పారు. అయితే ఆ వెంటనే ఈ-మెయిల్ ద్వారా లేఆఫ్ సందేశం వచ్చినట్లు తెలిపారు. ఇలా అర్ధాంతరంగా సంస్థ నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. తనకు ఇటీవలే మరో ఏడాదికి కాంట్రాక్టును పొడిగించారని.. జీతం గురించి కూడా చర్చించారని.. అంతలోనే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతర్జాతీయంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల గూగుల్‌ (Google) వెల్లడించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) ఉద్యోగులకు ఈ-మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చారు. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ప్రతిభను, మూలధనాన్ని అధిక ప్రాధాన్యతల వైపు మళ్లించడంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని అందులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని