AI: మనుషుల్ని చంపే ఆయుధాలనూ ఏఐ సృష్టించగలదు.. సునాక్‌ సలహాదారు హెచ్చరిక!

మానవుల ప్రాణాలు తీయగల సైబర్‌, బయోలాజికల్‌ ఆయుధాలను సృష్టించే సామర్థ్యం కృత్రిమ మేధకు (AI) ఉందని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ సలహాదారు క్లిఫర్డ్‌ హెచ్చరించారు.

Published : 07 Jun 2023 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేథను (Artificial intelligence) నియంత్రించకుంటే వచ్చే రెండేళ్లలో దానితో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ నిపుణులు, టెక్‌ దిగ్గజ అధినేతలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవి అనేక మందిని చంపే శక్తిమంతమైన ఆయుధాలను ఉత్పత్తి చేయడంలో దోహదపడతాయని బ్రిటన్‌ ప్రధాని సలహాదారుడు మ్యాట్‌ క్లిఫర్డ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

‘ఎన్నో ప్రాణాలు తీయగల సైబర్‌, బయోలాజికల్‌ ఆయుధాలను సృష్టించే సామర్థ్యం కృత్రిమ మేధకు (AI) ఉంది. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని (Artificial Intelligence) నియంత్రించకుంటే.. మానవుడు నియంత్రించలేని శక్తివంతమైన వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తాయి. ఏఐతో స్వల్ప, దీర్ఘకాలికంగా ఎన్నో రకాల ముప్పులు పొంచివున్నాయి. జీవాయుధాలు లేదా భారీ సైబర్‌ దాడులను చేసేందుకు అవసరమైన సాంకేతికత కోసం ఏఐను ఇప్పుడు వాడుకోవచ్చు. ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి’ అని ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మ్యాట్‌ క్లిఫర్డ్‌ హెచ్చరించారు. బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్న క్లిఫర్డ్‌.. చాట్‌ జీపీటీ, గూగుల్‌ బార్డ్‌ వంటి కృత్రిమ మేధ మోడల్స్‌పై పరిశోధన కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ మోడల్‌ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు. అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఇన్వెన్షన్‌ ఏజెన్సీ ఛైర్మన్‌గానూ ఉన్నారు.

మరోవైపు, ఏఐ సాంకేతికతో వస్తోన్న వ్యవస్థలు (చాట్‌జీపీటీ వంటివి) యావత్‌ మానవాళికి తీవ్ర ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని అంతర్జాతీయ టెక్‌ దిగ్గజ సంస్థల అధిపతులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా వ్యవస్థల అభివృద్ధిని నియంత్రించాల్సిన అవసరం ఉందని కోరుతూ అనేక మంది నిపుణులు బహిరంగ లేఖ రాశారు. అందులో ఎలాన్‌ మస్క్‌ వంటి కీలక వ్యక్తులు సంతకాలు చేశారు. దీన్ని సరైన విధంగా వినియోగించకుంటే హానికరమైన పరిణామాలు తప్పవని అటు గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) హెచ్చరించారు. కృత్రిమ మేధ దుష్ర్పభావాలను తలచుకుంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని