Australia: మరోసారి భగ్గుమన్న చైనా-ఆస్ట్రేలియా విభేదాలు

ఆస్ట్రేలియా-చైనా మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తమ దేశ యుద్ధ నౌకలోని డైవర్లతో చైనా అనుచితంగా ప్రవర్తించడాన్ని ఆస్ట్రేలియా ప్రధాని తప్పుపట్టారు.  

Published : 20 Nov 2023 15:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా-చైనా మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. చైనా నౌకాదళ చర్యలు అత్యంత ప్రమాదకరమని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ తప్పుపట్టారు. ఇటీవల జపాన్‌ సముద్ర జలాల్లో జరిగిన ఓ సంఘటనను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు. నవంబర్‌ 14వ తేదీన ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రిగెట్‌ ప్రొపెల్లర్‌లో  చేపల వల ఇరుక్కొంది. దీనిని తొలగించేందుకు ఆస్ట్రేలియా డైవర్లు సముద్రంలోకి దూకారు. అదే సమయంలో చైనాకు చెందిన ఒక డెస్ట్రాయర్‌ నౌక అక్కడకు చేరుకొని.. అక్కడ సోనార్‌ను వాడటం మొదలుపెట్టింది. ఈ ఘటనలో ఆస్ట్రేలియా డైవర్‌ స్వల్పంగా గాయపడ్డాడు.   

అల్‌-షిఫాలో బందీలను దాచిన హమాస్‌.. వీడియో విడుదల చేసిన ఐడీఎఫ్‌

తాజాగా ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ స్పందిస్తూ చైనా నౌకాదళ చర్యలు అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. వారి చర్యల కారణంగా ఒకరు గాయపడ్డారని పేర్కొన్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన అపెక్‌ సమ్మిట్‌లో ఈ అంశాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ వద్ద ప్రస్తావించారా లేదా అనే అంశాన్ని మాత్రం అల్బనీస్‌ వెల్లడించలేదు. దీనిపై స్పందిస్తూ.. ‘‘నేను మీకు ఒక విషయం చెప్పదల్చుకొన్నాను. ఈ అంశాన్ని సరైన చోట.. సరైన విధంగా లేవనెత్తుతాము’’ అని వ్యాఖ్యానించారు. 

ఈ ఘటనపై చైనా ప్రభుత్వం ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు. ఈ ఘటన చోటు చేసుకోవడానికి వారం ముందే ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ బీజింగ్‌లో పర్యటించి వచ్చారు.ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రికత్తలను తగ్గించే దిశగా ఈ పర్యటన చేపట్టారు. ఇక తాజా ఘటనతో మరోసారి విభేదాలు పెరుగుతాయా అన్న ప్రశ్నకు అల్బనీస్‌ స్పందిస్తూ.. ఇరు దేశాలు ఎక్కడ సహకరించుకోగలవో అక్కడ కలిసి పనిచేస్తాము.. అదే ఎక్కడ విభేదించగలవో అక్కడ విభేదిస్తామని తెలిపారు. తాము విభేదించిన చోట వీలైనంత బలంగా అభ్యంతరాలు తెలియజేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని