Israel-Hamas: అల్‌-షిఫాలో బందీలను దాచిన హమాస్‌.. ఫొటోలు విడుదల చేసిన ఐడీఎఫ్‌

అక్టోబరు 7 నాటి దాడి తర్వాత ఇజ్రాయెల్‌ నుంచి కిడ్నాప్‌ చేసిన బందీల్లో కొందర్ని హమాస్‌.. అల్-షిఫా ఆస్పత్రిలో దాచినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఐడీఎఫ్‌ బయటపెట్టింది.

Updated : 20 Nov 2023 16:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాజా (Gaza)లోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫా (Al-Shifa Hospital)ను.. హమాస్‌ (Hamas) తమ ప్రధాన కమాండ్‌ సెంటర్‌గా వాడుకుంటోందని చెబుతున్న ఇజ్రాయెల్‌ (Israel) అందుకు బలమైన సాక్ష్యాలను బయటపెడుతోంది. తాజాగా ఈ ఆస్పత్రిలో బందీలను దాచిపెట్టిన ఓ వీడియోను ఐడీఎఫ్‌ ఎక్స్‌ వేదికగా విడుదల చేసింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత ఆ దేశం నుంచి కిడ్నాప్‌ చేసిన కొంతమందిని అల్‌-షిఫాలో బందించేందుకు తీసుకురావడం ఆ వీడియోలో స్పష్టంగా కన్పించింది.

అక్టోబరు 7న ఉదయం 10.42 నుంచి 11 గంటల మధ్య అల్-షిఫా ఆస్పత్రి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయిన దృశ్యాలను ఐడీఎఫ్‌ విడుదల చేసింది. అందులో చేతిలో ఆయుధాలతో ఉన్న హమాస్‌ ఉగ్రవాదులు.. ఓ వ్యక్తిని బలవంతంగా ఆస్పత్రి లోపలికి లాక్కొస్తున్నట్లుగా ఉంది. తీవ్రంగా గాయపడిన మరో బందీని ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్తున్నట్లుగా వీడియోలో రికార్డ్‌ అయ్యింది. దీనిపై ఐడీఎఫ్‌ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ స్పందిస్తూ.. ఆ బందీలు నేపాల్‌, థాయ్‌లాండ్‌ దేశస్థులని తెలిపారు. ‘‘ఇప్పుడు ఆ ఇద్దరి పరిస్థితి ఎలా ఉంది? వారు ఎక్కడ ఉన్నారు? అనేది ఇంకా తెలియలేదు. ఇజ్రాయెల్‌పై నరమేధం జరిపిన రోజున అల్-షిఫా ఆస్పత్రిని వారు వినియోగించుకున్నారని మాత్రం స్పష్టమైంది’’ అని ఇజ్రాయెల్‌ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.

గాజా పాలనా పగ్గాలు పాలస్తీనా అథారిటీ చేతికే: బైడెన్‌

ఆస్పత్రి కింద సొరంగం..

ఇక, గత వారమే ఈ ఆస్పత్రిలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెల్‌ దళాలు అక్కడ ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆస్పత్రి కింద ఓ సొరంగాన్ని తాజాగా గుర్తించాయి. ఈ వీడియోను కూడా ఐడీఎఫ్‌ విడుదల చేసింది. ఆస్పత్రి కింద 10 మీటర్ల లోతులో 55 మీటర్ల పొడవులో ఈ టన్నెల్‌ ఉన్నట్లు తెలిపింది. అయితే, ఆ సొరంగంలో ఏమున్నదనే విషయాన్ని మాత్రం ఐడీఎఫ్‌ వెల్లడించలేదు.

మరోవైపు, హమాస్‌ మిలిటెంట్లపై జరుగుతున్న గ్రౌండ్‌ ఆపరేషన్‌లో మరో ఐదుగురు ఇజ్రాయెల్‌ సైనికులు మరణించారు. దీంతో భూతల పోరులో ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ వైపు 64 మంది సైనికులు మృతిచెందినట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని