Donald Trump: ట్రంప్‌ అరెస్టైతే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా..?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై వచ్చిన లైంగిక సంబంధాల ఆరోపణల కేసు విచారణ అంశం ఆసక్తిగా మారింది. ఒకవేళ  ఆయనపై అభియోగాలు రుజువైతే అమెరికా చరిత్రలోనే అటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న తొలి వ్యక్తిగా (అధ్యక్ష స్థానంలో) ట్రంప్‌ నిలిచిపోతారు.

Published : 20 Mar 2023 18:47 IST

న్యూయార్క్‌: త్వరలోనే నన్ను అరెస్టు చేసే అవకాశం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఇటీవల అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ ట్రంప్‌పై అభియోగాలు రుజువైతే మాత్రం అమెరికా (America) చరిత్రలోనే నేరారోపణలు ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడిగా నిలిచిపోతారు. ఇదే సమయంలో ట్రంప్‌ అరెస్టైతే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో (Presidential Election) ఆయనపై ఏవిధమైన ప్రభావం చూపిస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో అసలు అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయవచ్చా..? అనే అనుమానాలు ట్రంప్‌ మద్దతుదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అరెస్టు కావడం, నేరారోపణలు రావడం అనేవి వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ పోటీకి సాంకేతికంగా ఎటువంటి ప్రభావం చూపవని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఎన్నికల్లో పోటీపై ప్రభావమెంత..?

2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని డొనాల్డ్‌ ట్రంప్‌ గతేడాదే ప్రకటించారు. మరింత మంది రిపబ్లికన్‌ నేతలు పోటీలో ఉన్నప్పటికీ ప్రైమరీల్లో పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన మహిళను డబ్బులతో ప్రలోభపెట్టినట్లు ట్రంప్‌పై వచ్చిన ఆరోపణల కేసు విచారణకు వచ్చింది. ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన వ్యక్తి పదవిలో ఉన్న సమయంలో లేదా పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఎటువంటి నేరారోపణలు ఎదుర్కోలేదు. అయినప్పటికీ డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ప్రచారాన్ని కొనసాగిస్తానని చెబుతున్నారు.

ప్రచారంలో ఇబ్బందులే..

దేశాధ్యక్ష పోటీలో ఉండే అభ్యర్థి జైలు, నేర చరిత్రకు సంబంధించి అమెరికా రాజ్యాంగంలో ఎటువంటి ప్రస్తావన లేదు. పోటీలో ఉండే వ్యక్తి  అమెరికాలో జన్మించి ఉండాలి. అమెరికా పౌరుడై, కనీస వయసు 35ఏళ్లు ఉండాలి.  అధ్యక్ష పదవికి అర్హతలు. దీని ప్రకారం, ట్రంప్‌ జైలు వెళ్లాల్సి వచ్చినా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎటువంటి ఆటంకం ఉండదని తెలుస్తోంది. కానీ, ఆరోపణలు రుజువైతే మాత్రం ట్రంప్‌నకు ప్రజల దృష్టిలో, ప్రచారం సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని అంచనా. లేదా ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే జైలు నుంచే ప్రమాణస్వీకారం చేయడం కూడా ఇబ్బంది కలిగించే అంశాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇదిలాఉంటే, లైంగిక సంబంధాలు నెరిపాడని ఆరోపించిన మహిళలను డబ్బుతో ప్రలోభపెట్టడం, 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించడం వంటి పలు అభియోగాలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎదుర్కొంటున్నారు. మాన్‌హాటన్‌ జిల్లా అటార్నీ కార్యాలయం నుంచి అనధికారికంగా తెలిసిన సమాచారం ప్రకారం తాను 21వ తేదీన అరెస్టు అయ్యే అవకాశం ఉందని ట్రంప్‌ ఈ మధ్యే పేర్కొన్నారు. లైంగిక సంబంధాల ఆరోపణల్ని ఇదివరకే తోసిపుచ్చిన ఆయన.. ఒకవేళ తాను అరెస్టైతే పెద్దఎత్తున నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని