Canada: విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై కెనడా పరిమితి

Canada: దేశీయంగా పెరుగుతున్న ఇళ్ల కొరత, నిరుద్యోగ సమస్యకు చెక్‌ పెట్టడం కోసం కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులకు ఇవ్వబోయే కొత్త పర్మిట్లపై పరిమితి విధించింది.

Updated : 23 Jan 2024 16:01 IST

ఒట్టావా: కెనడాకు (Canada) వచ్చే విదేశీ విద్యార్థులకు కొత్తగా ఇవ్వబోయే స్టడీ పర్మిట్లపై రెండేళ్ల పాటు పరిమితి విధించనున్నట్లు ఆ దేశ ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్ సోమవారం ప్రకటించారు. ఇప్పుడు ఇస్తున్న వాటిలో మూడో వంతు పర్మిట్లపై కోత పెట్టనున్నట్లు తెలిపారు. దేశీయంగా పెరుగుతున్న ఇళ్ల కొరత, నిరుద్యోగ సమస్యకు చెక్‌ పెట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దశాబ్దం క్రితంతో పోలిస్తే దేశంలో విదేశీ విద్యార్థుల సంఖ్య మూడింతలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

పరిమితి అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది 3.64 లక్షల మంది విద్యార్థులకు పర్మిట్లు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2023తో పోలిస్తే ఇది 35 శాతం తక్కువ. 2025కు సంబంధించిన అంచనాలను ఈ ఏడాది చివర్లో వెల్లడిస్తామని మిల్లర్ తెలిపారు. విదేశీ విద్యార్థుల అనుమతి విధానాన్ని మరింత మెరుగుపర్చి వారికి ఉన్నతమైన విద్యను అందించడమే పరిమితి వెనుక ప్రధాన ఉద్దేశమని వివరించారు. అలాగే తగినన్ని నివాసాలను అందుబాటులో ఉంచడం కూడా ఓ కారణమన్నారు. ఇక్కడికి వచ్చే వారందరికీ సరైన వనరులు అందివ్వకపోవడం సమంజసం కాదని తాము భావిస్తున్నామన్నారు. నిరాశతో వారు సొంత దేశానికి తిరిగి వెళ్లడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు.

భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం: ఎలాన్‌ మస్క్‌

మాస్టర్స్‌, డాక్టోరల్‌ విద్యార్థులకు వర్తించదు..

ఇప్పటికే ఇచ్చిన పర్మిట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని మిల్లర్‌ స్పష్టం చేశారు. మాస్టర్స్‌, డాక్టోరల్‌ విద్యార్థులకు తాజా పరిమితులు వర్తించవని తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రావిన్స్‌ల వారీగా పర్మిట్లను కేటాయిస్తారు. అక్కడి సంస్థలు, వనరుల ఆధారంగా స్థానిక ప్రభుత్వాలు వాటిని పంపిణీ చేయాలి. ఆయా సంస్థల అనుమతి కోరుతూ వచ్చిన పర్మిట్ల దరఖాస్తులపై ప్రావిన్స్‌ లేదా టెరిటరీలు ఆమోద లేఖ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు తగిన మార్పులు చేసుకునేందుకు కెనడా (Canada) ప్రభుత్వం మార్చి 31 వరకు ప్రావిన్స్‌లకు గడువిచ్చింది.

వర్క్‌ పర్మిట్లలోనూ మార్పులు..

‘పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వర్క్‌ పర్మిట్లకు (PGWP)’ సంబంధించిన అర్హతల్లోనూ కెనడా (Canada) ప్రభుత్వం మార్పులు చేసింది. 2024 సెప్టెంబర్‌ నుంచి ‘కరికులం లైసెన్సింగ్‌ అరేంజ్‌మెంట్స్’ కింద నమోదు చేసుకున్న విద్యార్థులకు వర్క్‌ పర్మిట్‌ ఇవ్వబోమని తెలిపింది. మరోవైపు మాస్టర్స్‌ ప్రోగ్రామ్ కింద నమోదైన గ్రాడ్యుయేట్లు మూడేళ్ల వర్క్‌ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించడం గమనార్హం.

కెనడాలో విద్యనభ్యసించడానికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికం. 2022లో 2,25,835 స్టడీ పర్మిట్లు జారీ చేయగా.. అందులో 41 శాతం భారతీయ విద్యార్థులే సొంతం చేసుకున్నారు. అక్కడి విశ్వవిద్యాలయాలకు విదేశీ విద్యార్థులే ప్రధాన ఆదాయ వనరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని