Best Airport: ప్రపంచంలోనే ది బెస్ట్‌ విమానాశ్రయం ఇదే.. రెండేళ్ల తర్వాత మళ్లీ..!

ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్‌లోని ‘ఛాంగి’ (Changi) విమానాశ్రయంలో నిలిచింది. రెండేళ్ల తర్వాత ఖతార్‌ను వెనక్కినెట్టి తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

Updated : 16 Mar 2023 16:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సింగపూర్‌లోని ‘ఛాంగి’ అంతర్జాతీయ విమానాశ్రయం (Changi International Airport) ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది. రెండేళ్ల తర్వాత ఖతార్‌ (Qatar)ను వెనక్కి నెట్టి మళ్లీ తన స్థానాన్ని తిరిగి సాధించుకుంది. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో సింగపూర్‌ విదేశీ విమానాల రాకపోకలపై తీవ్ర ఆంక్షలు విధించింది. దీంతో రెండేళ్ల క్రితం ఆ స్థానాన్ని ఖతార్‌ చేజిక్కించుకుంది. అయితే, పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో రాకపోకలపై సింగపూర్‌ ఆంక్షలు ఎత్తివేసింది. దీంతో మళ్లీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఖతార్‌ రాజధాని దోహా (Doha)లోని హమద్‌ ( Hamad) అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానంలో నిలవగా.. టోక్యోలోని హనీదా విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది. విమాన ప్రయాణం చేసిన తర్వాత ప్రయాణికులు ఇచ్చే ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా స్కైట్రాక్స్‌ సంస్థ ప్రతి ఏటా సర్వే నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే తొలి 20 ఉత్తమ విమానాశ్రయాలను ఎంపిక చేసి.. స్కైట్రాక్స్‌ వరల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ అవార్డ్స్‌ పేరిట సత్కరిస్తోంది. అయితే, ఉత్తమ ఎయిర్‌పోర్టులుగా నిలిచిన వాటిలో తొలి 10 స్థానాల్లో అమెరికాకు చెందిన ఒక్క విమానాశ్రయం కూడా లేకపోవడం గమనార్హం.

ప్రపంచంలో తొలి 20 అత్యుత్తమ విమానాశ్రయాలు ఇవే..

1.ఛాంగి (సింగపూర్‌) 2. హమద్‌ (దోహా) 3. హనీదా (టోక్యో) 4.ఇన్చెయాన్‌ (సియోల్‌) 5. చార్లెస్‌ డి గలే (పారిస్‌) 6. ఇస్తాంబుల్‌ (తుర్కియే) 7. మ్యూనిక్‌ (జర్మనీ) 8. జ్యూరిక్‌ (స్విట్జర్లాండ్‌) 9. నరీతా (టోక్యో), 10 బరాజస్‌ (మాడ్రిడ్‌) 11. వియన్నా (ఆస్ట్రియా) 12. వాంటా (ఫిన్లాండ్‌) 13. ఫ్యూమిసినో (రోమ్‌). 14. కోపెన్‌ హెగెన్‌ (డెన్మార్క్‌) 15.కాన్సాయ్‌ (జపాన్‌) 16. సెంట్రైన్‌ నయోగా (జపాన్‌) 17. దుబాయ్‌  18. టకోమా (సియాటెల్‌), 19. మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా) 20.వాంకోవర్‌ (కెనడా).

  • న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయం 85వ స్థానం నుంచి 88కి పడిపోయింది.
  • చైనాకు చెందిన షెంజెన్‌ 26 స్థానాలు ముందుకెళ్లి 31వ స్థానంలో నిలిచింది
  • గత ఏడాది 26 స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ ఈసారి 19వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాలోని విమానాశ్రయాల్లో ఇదే అత్యుతమైనదిగా నిలిచింది.
  • లండన్‌లోని హీత్రో విమానాశ్రయంలో 9 స్థానాలు పడిపోయి 22వ స్థానంలో నిలిచింది.
  • భారత్‌లోని ఏ విమానాశ్రయమూ తొలి 20 స్థానాల్లో నిలవక పోయినప్పటికీ దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణాసియాలో ఉత్తమ ఎయిర్‌పోర్టుగా నిలిచింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు