Chile: చిలీలో కార్చిచ్చు.. రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు..13 మంది మృతి

వేడిగాలుల తీవ్రతతో చిలీ(Chile) దేశంలో కార్చిచ్చు వ్యాపించింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రం కానుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 04 Feb 2023 13:41 IST

శాంటియాగో: లాటిన్‌ అమెరికా దేశం చిలీ(Chile) కార్చిచ్చు(wildfire)లో చిక్కుకుపోయింది. అక్కడి అటవీ ప్రాంతాల్లో అగ్ని కీలలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. రహదారుల మీదకు దూసుకొస్తున్నాయి. వేడిగాలుల ఎఫెక్ట్‌తో వేల ఎకరాలు దగ్ధమవుతున్నాయి. వీటిని అదుపులోకి తెచ్చే క్రమంలో.. అలాగే వీటి నుంచి బయటపడే ప్రయత్నంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.

చిలీ రాజధాని శాంటియాగోకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయోబయో(Biobio), నుబుల్(Nuble) ప్రాంతంలో కార్చిచ్చు దావానలంలా వ్యాపించిందని స్థానిక అధికారులు వెల్లడించారు. 14 వేల హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైందని తెలిపారు. ఈ మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో అగ్ని మాపక సిబ్బంది ఒకరు బలయ్యారు, మరికొందరికి తీవ్ర గాయలయ్యాయి. ఈ మంటలు రహదారి మీదకు దూసుకురావడంతో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకో ఘటనలో అత్యవసర సేవల బృందానికి చెందిన  హెలికాఫ్టర్ కూలిపోవడంతో మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మొత్తంగా ఇప్పటివరకు 13 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ కార్చిచ్చుతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని, దగ్గర్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ఇప్పటివరకు వందల ఇళ్లు కాలిపోయాయని హోంమంత్రి కరోలినా తోహా  వెల్లడించారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో చిలీ ప్రభుత్వం అత్యయిక స్థితిని విధించింది. ఇంకా వేడిగాలులు తీవ్రత పెరిగే అవకాశం ఉందని నేషనల్ ఫారెస్ట్రీ కార్పొరేషన్ హెచ్చరించింది. గతంలో కంటే రెండు రెట్లు అధికంగా అటవీ ప్రాంతం దగ్ధమైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని తెలిపింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని