China: చైనా అత్యుత్సాహం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌ ప్రసారాలపైనా ఆంక్షలు!

కరోనా కేసుల నియంత్రణ కోసం చైనా తీసుకుంటున్న నిర్ణయాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌ ప్రసారాలపై కూడా ఆంక్షలు విధించింది. 

Published : 29 Nov 2022 01:39 IST

బీజింగ్‌: చైనాలో కరోనా కేసుల నియంత్రణ కోసం ఆ దేశ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖతార్ వేదికగా జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌ల ప్రసారాలపై ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా మ్యాచ్‌ ప్రసారాల్లో మాస్క్‌ ధరించని ప్రేక్షకుల ముఖాలను  దగ్గరగా చూపించవద్దని ఆ దేశ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలను ఆదేశించింది. 

ఆదివారం జరిగిన జపాన్‌-కోస్టారికా మ్యాచ్‌కు సంబంధించి మాస్క్‌ లేకుండా గ్యాలరీలో కేరింతలు కొడుతున్న ప్రేక్షకుల వీడియోలకు బదులు ఆటగాళ్లు, స్టేడియంలోని అధికారుల ఫొటోలను సీసీటీవీ స్పోర్ట్స్‌ ప్రసారం చేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. చైనా సోషల్‌ మీడియా యాప్‌లలో ప్రత్యక్ష ప్రసారమైన మ్యాచ్‌కు, టీవీ ఛానెళ్లలో ప్రసారమైన మ్యాచ్‌కు మధ్య వ్యత్యాసం ఉండంతో పలువురు యూజర్లు సైతం సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 

గత నాలుగు రోజులుగా చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్‌ కట్టడిలో భాగంగా చైనా ప్రభుత్వం ‘జీరో కొవిడ్’ విధానాన్ని అమలుచేస్తోంది. ఇందుకోసం లాక్‌డౌన్‌, క్వారంటైన్‌ నిబంధనలు కఠినంగా అమలుచేస్తోంది. వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు మూతపడటంతో ఆర్థికవ్యవస్థ ప్రమాదంలో పడుతుందనే ఆందోళన పెరిగింది. మరోవైపు ఆంక్షల నడుమ జీవనం సాగించాల్సి రావడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. దీంతో చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. తాజాగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ప్రసారాలపై ఆంక్షలు విధించడం ఆ దేశంలో పరిస్థితులకు అద్దం పడుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని