Nepal: నేపాల్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం?

నేపాల్‌ ప్రభుత్వంలో మరోసారి సంక్షోభం తలెత్తింది. ఈ సారి ఓలి వర్గం మద్దతు ఉపసంహరించుకొంది. 

Updated : 27 Feb 2023 19:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నేపాల్‌(Nepal)లో పుష్ప కమల్‌ దహల్‌ (ప్రచండ) నేతృత్వంలోని ప్రభుత్వానికి సోమవారం  సీపీఎన్‌ - యూఎంఎల్‌ మద్దతు ఉపసంహరించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకుడు ఒకరు ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో  రాజకీయ సమీకరణల్లో మార్పుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించారు. తొలుత మార్చి9న అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే వరకు వేచిచూద్దామని యూఎంఎల్‌ భావించింది. కానీ, రాజకీయ విభేదాలు తీవ్రం కావడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. 

అసలే బలహీనంగా ఉన్న నేపాల్‌ ప్రభుత్వానికి ఇది పెద్ద కుదుపు. సీపీఎన్‌-యూఎంఎల్‌కు చెందిన బిమల రాయ్‌ పౌడ్యాల్‌ జెనీవా పర్యటనను ప్రధాన మంత్రి రద్దు చేశారు. అదే సమయంలో సచివాలయంలో మీటింగ్‌కు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేశారు. మద్దతు ఉపసంహరణ వేగంగా తీసుకోవడం  వెనుక ఈ ఘటన కూడా కారణం కావచ్చని ప్రచారం జరుగుతోంది.

తమ నిర్ణయం వెనుక కారణాన్ని యూఎంఎల్‌ వైస్‌ ఛైర్మన్‌ బిష్ణు పౌడెల్‌ వివరించారు. ‘‘నేపాల్‌ ప్రధాని విభిన్న పద్దతుల్లో పాలించడం మొదలుపెట్టాకే మేం మద్దతు ఉపసంహరణపై నిర్ణయం తీసుకొన్నాం. అంతేకాదు, అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించిన రాజకీయ సమీకరణల్లో మార్పులు కూడా  కారణమే’’ అని ఆయన వెల్లడించారు. ప్రచండ-ఓలీ మధ్య విభేదాలకు అధ్యక్ష ఎన్నికలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నేపాల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రామ చంద్ర పౌడెల్‌ అధ్యక్ష అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రచండా వర్గం భావిస్తోంది. పౌడెల్‌ నేపాల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ నిర్ణయాన్ని ఓలి వర్గం వ్యతిరేకిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో యూఎంఎల్‌  పార్టీతరుపున సుభాశ్‌ నెంబాగ్‌ను బరిలోకి దించాలని సీపీఎన్‌-యూఎంఎల్‌ నిర్ణయించింది. 

అధికార పంపిణీ ఒప్పందంలో తలెత్తిన విభేదాల కారణంగా 2022 డిసెంబర్లోనే ప్రచండ కాంగ్రెస్‌ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. 275 సీట్లు ఉన్న ప్రతినిధుల సభలో 138కి పైగా సీట్లు పొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే, ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి పలు పార్టీలకు సూచించారు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా తన మద్దతుదారులతో కలిసి వెళ్లి ప్రచండ రాష్ట్రపతిని కోరారు.

ఆయనకు అప్పట్లో సీపీఎన్‌-యూఎంఎల్‌ ఛైర్మన్‌ కేపీ శర్మ ఓలి, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు రవి లమిచ్చనే, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అధ్యక్షుడు రాజేంద్ర లింగడేన్‌ తదితరులు  మద్దతు తెలిపారు. పార్లమెంట్‌లోని 275 మంది సభ్యుల్లో 165 మంది ప్రచండకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ప్రచండ నేపాల్‌ ప్రధానిగా మూడో సారి నియమితులయ్యారు. కనీసం మూడు నెలలు కూడా కాకుండానే అధికార కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. ఈ సారి నేపాల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆదుకొనే అవకాశాలున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని