Updated : 07 Jan 2022 12:34 IST

Omicron: వారంలో 71% పెరిగినకొత్త కేసులు: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కల్లోలం రేపుతోంది. ప్రధానంగా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. వారం రోజుల వ్యవధిలో ఏకంగా 71% కొత్త కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. డిసెంబరు 27 - జనవరి 2 మధ్య అంతకు ముందు వారంతో పోలిస్తే ఈ పెరుగుదల నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గురువారం తెలిపింది. అయితే కొంత ఊరటనిచ్చేలా.. కొత్తగా నమోదైన మరణాల సంఖ్య 10% తగ్గినట్లు వెల్లడించింది. ఈమేరకు గత వారంలో 95 లక్షల కేసులు నమోదు కాగా, 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా అమెరికాలో కేసులు 100% పెరగ్గా, ఆగ్నేయాసియాలో 78%, ఐరోపాలో 65%, తూర్పు మధ్యధరా ప్రాంతంలో 40%, పశ్చిమ పసిఫిక్‌లో 38%, ఆఫ్రికన్‌ ప్రాంతంలో 7% కేసులు పెరిగినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. 

- ప్రపంచవ్యాప్తంగా బుధవారం 25.7 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 7,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క అమెరికాలోనే 7 లక్షలకు పైగా రోజువారీ కేసులు బయటపడ్డాయి. ఫ్రాన్స్‌ (3.3 లక్షలు), బ్రిటన్‌ (1.9 లక్షలు), ఇటలీ (1.89 లక్షలు), స్పెయిన్‌ (1.37 లక్షలు)లోనూ భారీగా కేసులు నమోదయ్యాయి. 

- అమెరికాలోని కాలిఫోర్నియాలో అధిక సంఖ్యలో వైద్య సిబ్బంది కొవిడ్‌ బారిన పడటంతో ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రమవుతోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తితో ఆసుపత్రులన్నీ రోగులతో కిక్కిరిసి పోతుండగా.. వారికి చికిత్సలు అందించలేని పరిస్థితి ఎదురవుతోంది. దాదాపు 40% ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత నెలకొన్నట్లు తెలుస్తోంది. 

- సింగపూర్‌లో డెల్టా రకంతో పోలిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌తో మరింత పెద్ద కొవిడ్‌ వేవ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. డెల్టా వేరియంట్‌ కేసులు రెట్టింపు కావడానికి 6-8 రోజులు పట్టగా.. ఒమిక్రాన్‌ విషయంలో కేవలం రెండు మూడు రోజుల్లోనే ఆ స్థాయికి పెరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 
- చైనాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జియాన్‌ నగరానికి అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేశారు. డిసెంబరు ప్రారంభం నుంచి ఇక్కడ లాక్‌డౌన్‌ అమలవుతుండగా.. ఇప్పటికే దేశీయ విమానాలపై నిషేధం విధించారు.

థాయిలాండ్‌లో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం 4వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఇక్కడ 5,775 కొత్త కేసులు బయటపడ్డాయి. 4వ హెచ్చరిక ప్రకారం.. అధిక ముప్పు ఉన్న ప్రాంతాలను మూసివేస్తారు. అంతర్గత ప్రయాణాలపై ఆంక్షలు పెంచుతారు. బహిరంగ ప్రాంతాల్లో 
గుమిగూడటంపై పరిమితి విధిస్తారు.

ఫిలిప్పీన్స్‌లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు ఏకంగా 36.9%కి పెరిగింది. అంటే పరీక్షలు జరిపిన ప్రతి ముగ్గురిలో ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. ఇక్కడ గురువారం 17,220 కేసులు నమోదయ్యాయి. 

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని