US Visa: అమెరికా వీసా రుసుములు భారీగా పెంపు!

వలసేతర, ఉద్యోగ ఆధారిత వీసా దరఖాస్తుల రుసుములను భారీగా పెంచేందుకు అమెరికాలోని బైడెన్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

Updated : 06 Jan 2023 06:57 IST

బైడెన్‌ ప్రభుత్వం ప్రతిపాదన
60 రోజుల తర్వాత అమలులోకి!

వాషింగ్టన్‌: వలసేతర, ఉద్యోగ ఆధారిత వీసా దరఖాస్తుల రుసుములను భారీగా పెంచేందుకు అమెరికాలోని బైడెన్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) బుధవారం తన వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది. రుసుములు భారీగా పెరగనున్న వీసాల్లో హెచ్‌-1బి, హెచ్‌-2బి, ఎల్‌-1, ఓ-1లతో పాటు ఈబీ-5లు ఉన్నాయి. అయితే, వీటిలో అత్యధికం తమ ఉద్యోగులను అమెరికాకు పంపించే కంపెనీలు భరించేవే.

* పెట్టుబడితో ముడిపడిన గ్రీన్‌ కార్డు (ఈబీ-5) దరఖాస్తుల రుసుములు 3,675 డాలర్ల నుంచి 11,160 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. హెచ్‌-1బి ఇ రిజిస్ట్రేషన్‌ రుసుము ప్రస్తుతం 10 డాలర్లు కాగా తాజా ప్రతిపాదన అమలులోకి వస్తే 215 డాలర్లు చెల్లించాల్సి వస్తుంది.

అభ్యంతరాల స్వీకరణ తర్వాత అమలు

కొత్త రుసుముల ప్రతిపాదనలపై అభ్యంతరాలు తెలపడానికి 60 రోజుల వ్యవధి ఇచ్చారు. ఆ తర్వాత దీన్ని అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. దరఖాస్తుల ప్రాసెసింగ్‌ ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగానే రుసుముల పెంపును ప్రతిపాదించినట్లు యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. ఈ నిర్ణయంతో పెండింగ్‌ వీసాల సంఖ్య  తగ్గుతుందని తెలిపింది.  2016 నుంచి వీసా దరఖాస్తు రుసుముల్లో మార్పు చేయలేదని, ఆరేళ్ల తర్వాత వాటిని పెంచాలని ప్రతిపాదించినట్లు యూఎస్‌సీఐఎస్‌ డైరెక్టర్‌ తెలిపారు.


భారత్‌లో వీసా ఇంటర్వ్యూల నిరీక్షణ సమయం తగ్గిస్తాం
అమెరికా

గతేడాది అత్యధికంగా 1,25,000 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. భారత్‌లో వీసా ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్‌ నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. ‘ వీసాల జారీ కోసం కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాం. ఇప్పుడు వీసా జారీల ప్రక్రియ కొంత పుంజుకుంది. ఏడాదిలోగా కొవిడ్‌ ముందు నాటి స్థితికి చేరుకుంటుంద’ని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని